
సాక్షి, తాడేపల్లి: ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఆంధ్రప్రదేశ్-ఏఐటీయూసీ) ప్రతినిధుల బృందం మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసింది. కూటమి పాలనలో తాము పడుతున్న ఇబ్బందులు, బాధలను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
ఏపీ పర్యాటక అభివృద్ది సంస్ధలోని 22 హోటల్స్, రిసార్ట్స్‌లను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు వీలుగా ఇచ్చిన జీవో నెంబర్ 23 తీసుకొచ్చింది. దానిని అడ్డుకోవాలని కోరుతూ ప్రతినిధుల బృందం వైఎస్ జగన్‌కు ఓ వినతి పత్రం సమర్పించింది. ‘‘గత పాతికేళ్ళుగా టూరిజం సంస్ధలో కాంట్రాక్ట్ పద్దతిలో 504 మంది, ఔట్‌సోర్సింగ్‌లో 488 మంది ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ ఈ జీవోతో మాకు ఉద్యోగ భద్రత లేకుండా చేశారు. టూరిజం ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా మా కుటుంబాలు రోడ్డున పడతాయి’’ అని జగన్ వద్ద కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
తన దృష్టికి వచ్చిన విషయాలను పరిశీలించిన వైఎస్ జగన్.. టూరిజం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషిచేస్తానని భరోసా ఇచ్చారు.