సాక్షి, పల్నాడు జిల్లా: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద బస్సు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను దాచేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు దాచేపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
హైదరాబాద్‌లో ట్రావెల్స్ బస్సు బోల్తా
మరో ఘటనలో హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఇవాళ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో ఆంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు.



