మక్కీకి..మక్కీ..!
శుభ్రతలోనూ కల్తీ మకిలీ పట్టుబడ్డ నకిలీ హార్పిక్, లైజాల్ మార్కెట్‌లో డూప్లికేట్ విక్రయాలపై కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు పోలీసుల దాడులతో వెలుగుచూసిన నకిలీ వ్యవహారం పల్నాడు జిల్లాలో విస్తుపోతున్న వినియోగదారులు
సేమ్ టు సేమ్.. నకిలీ స్కామ్
క్లీనింగ్‌కు ఉపయోగించేటప్పుడు ముక్కు పుటాలు బద్ధలవుతున్నా అనుమానానికి ఆస్కారం లేదు.. ఆ వాసన శ్వాసకోశ వ్యాధులకు గురి చేస్తున్నా ఆరా తీసే అవకాశం లేదు.. లేబుళ్లు, బాటిల్ ఆకృతిలో మార్పు లేదు.. రంగులో తేడా లేదు.. కానీ కల్తీ మాత్రం నట్టింట చేరి ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తోంది. కల్తీకి కాదేదీ అనర్హం అన్న చందంగా బాత్ రూములు క్లీన్ చేసే హార్పిక్, ఫ్లోరింగ్ తుడిచే లైజాల్ కు నకిలీ మకిలీ అంటించేశారు. నరసరావుపేట కేంద్రంగా కల్తీ హార్పిక్, లైజాల్‌ను మార్కెట్‌లోకి పంపించేశారు. అధికారుల నిర్లక్ష్యానికి సవాల్ విసురుతూ యథేచ్ఛగా వ్యాపారం సాగించేస్తున్నారు.
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నకిలీ హార్పిక్, లైజాల్‌లు పట్టుబడటం కలకలం రేపుతుంది. ఇటీవల నకిలీ బాస్మతి బియ్యం పట్టుబడిన విషయం మరువక ముందే హార్పిక్, లైజాల్ నకిలీవి వెలుగు చూడటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. వంట నూనె, దీపారాధన నూనెలతో మొదలైన కల్తీ వ్యాపారం ఇంటి పరిశుభ్రత ఉత్పత్తుల వరకు విస్తరించింది. అసలుకు ఏ మాత్రం తీసిపోకుండా నకిలీలను అక్రమార్కులు మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. వీటిని వినియోగదారులు గుర్తు పట్టడం ఆసాధ్యంగా మారింది. దీంతో అక్రమార్కులు కల్తీకి కాదేది అన్న చందంగా ప్రతి వస్తువునూ డూప్లికేట్ తయారు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికారుల నిఘా కూడా అంతంతమాత్రంగా ఉండటంతో అక్రమ వ్యాపారులు యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బాత్రూంలు శుభ్రపరిచే హార్పిక్, ఫ్లోరింగ్ శుభ్రం చేసే లైజాల్ డూప్లికేట్ బాటిళ్లను దిగుమతి చేసి ఇక్కడ గత కొన్ని నెలలుగా విక్రయిస్తున్నారు. ఇందులో నరసరావుపేటకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విషయం తెలుసుకున్న హార్పిక్, లైజాల్ కంపెనీల ప్రతినిధులు గత గురువారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దాడితో ఈ నకిలీ వ్యవహారం వెలుగు చూసింది.
ఆందోళనలో వినియోగదారులు..
కల్తీల కారణంగా మార్కెట్‌లో దొరికే వస్తువుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. అక్రమార్కులు ప్రతి వస్తువును మక్కీకి మక్కీ తయారు చేసి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజారోగ్యంపై ఈ ప్రభావం తీవ్రంగా చూపుతన్నప్పటికీ అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో దొరికే వస్తువుల సైతం అనుమానించాల్సి వస్తుంది.
పోలీసుల అదుపులో నిందితులు..
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో సత్తెనపల్లి రోడ్డులోని కామాక్షి జనరల్ స్టోర్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ హార్పిక్, లైజాల్ డూప్లికేట్ బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పాతూరులోని మరో దుకాణంపై దాడులు నిర్వహించి నకిలీ హార్పిక్, లైజాల్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని దుకాణ నిర్వాహకుడిని స్టేషన్‌కు తరలించారు.
కేసు నమోదు..
హార్పిక్, లైజాల్ సంస్థ ప్రతినిధి గరికముక్కు వినోద్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు. డూప్లికేట్ బాటిళ్లు విక్రయిస్తున్న దుకాణ నిర్వాహకులు మధుసూదనరావు, మణికంఠ లపై కేసు నమోదు చేశామన్నారు. మొత్తం 15 కల్తీ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన దుకాణాల్లో తనిఖీలు చేయాల్సి ఉందన్నారు. విచారణలో కల్తీ తయారీలో కీలక నిందితుల పాత్ర తేలనుందన్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న డూప్లికేట్ హార్పిక్, లైజాల్ బాటిళ్లు
మక్కీకి..మక్కీ..!


