కంత్రీని పట్టించిన నిఘా నేత్రం
ఘటన సమీపంలోని సీసీ కెమెరాతో వెలుగులోకి వాస్తవాలు విద్యార్థుల మరణానికి కారణం ఏఎస్‌ఐ కుమారుడని తెలిసినా మిన్నకుండిన పోలీసులు ఖాకీ కంత్రి కొడుకును తప్పించేందుకు ప్రయత్నించిన ఓ పోలీసు అధికారి రవాణాశాఖ అధికారులపై నెట్టే ప్రయత్నం తమ శాఖకు చెందిన వారు కాదంటూ స్పష్టం చేసిన రవాణాశాఖ తప్పనిసరి పరిస్థితుల్లో ఏఎస్‌ఐ కొడుకును అదుపులోకి తీసుకున్న వైనం వెల్దుర్తి పోలీసుస్టేషన్‌కు ఏఎస్‌ఐ బదిలీ
సాక్షి, నరసరావుపేట: వంద గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానకు పోయిందనేది సామెత. వంద తప్పులు తర్వాతే శిశుపాలుడి పాపాలు పండాయి. అలాగే లెక్కకు లేనన్ని తప్పులు చేసిన ఆ ఖాకీ కంత్రి కొడుకు పాపాలు ఇంజనీరింగ్ విద్యార్థుల మరణంతో ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తండ్రి అధికారం.. ఉన్నతాఽధికారుల సహాయసహకారాలతో ఇప్పటివరకు బయటపడినట్టే ఈసారి బయటపడాలని చూసినా ప్రమాద ఘటనలో ఉన్న సీసీ కెమెరాలు అసలు నేరస్తులను పట్టించాయి. చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈ నెల 4న జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు విద్యార్థుల మరణానికి కారణమైన ఏఎస్‌ఐ కుమారుడి గ్యాంగ్ ప్రమేయం గురించి తెలిసినా తొలుత పోలీసులు మిన్నుంకుండిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్లతో వెళ్తున్న ట్రాలర్‌ను రవాణాశాఖ అధికారులు కారులో వెంబడించి ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని తొలుత ప్రచారం జరిగింది. ప్రమాదం జరగగానే రవాణాశాఖ అధికారులు జారుకున్నారని సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఈ సమయంలో తన కొడుకును తప్పించేందుకు సదరు ఏఎస్‌ఐ తనకు అండగా నిలిచే జిల్లా పోలీసు కార్యాలయంలోని కీలక అధికారి ద్వారా ప్రయత్నించినట్టు
తెలుస్తోంది.
చేతులెత్తేసిన ‘స్పెషల్’ అధికారి...
ప్రమాదానికి కారణం రవాణాశాఖ అధికారులని ప్రచారం జరగడంతో వెంటనే స్పందించిన పల్నాడు జిల్లా రవాణా అధికారి సంజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రమాదం జరిగినచోట ఉన్న సీసీ కెమెరా పుటేజ్‌ను పరిశీలించామని.. ప్రమాదానికి కారణమైన టీఎస్08హెచ్‌వై 3158 కారు రవాణాశాఖకు సంబంధం లేదని, ఆ వ్యక్తులు మా ఉద్యోగులు కాదని స్పష్టం చేశారు. దీంతో ఏఎస్‌ఐ కొడుకును కాపాడే ప్రయత్నాలకు బ్రేక్ పడిందని మృతుల బంధువులు అభిప్రాయపడుతున్నారు. అప్పటివరకు కారు అతివేగంతో ప్రమాదం జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారని, రవాణాశాఖ వారి వీడియోతో వాస్తవం బయటపడిందంటున్నారు. మరోవైపు మీడియాలో ఏఎస్‌ఐ కుమారుడి పాత్రపై వార్తలు రావడంతో తానేమి చేయలేని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి చేతులెత్తేసినట్ట సమాచారం.
గుడి కోసం చందాలు భారీగా వసూలు...
ఆ స్పెషల్ అధికారే తండ్రి కొడుకుల ఆగడాలకు అండగా నిలిచాడని, తన గ్రామంలో కడుతున్న గుడి కోసం వీరిద్దరి ద్వారా భారీగా చందాలు వసూళ్లు చేశారని పోలీసుశాఖలో వినిపిస్తోంది. గత జిల్లా ఎస్పీ ఉన్నసమయంలో స్పెషల్ అధికారి తరఫున అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారితో భారీగా మూమూళ్లు వసూలు చేసే బాధ్యత సైతం ఇదే తండ్రి కొడుకులు చూశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యభిచార గృహాలు, స్పా సెంటర్లు, రేషన్ మాఫీయా, పేకాట, పోలీసుశాఖలో సిబ్బంది బదిలీలు వంటివాటిలో సదరు అఽధికారి, ఏఎస్‌ఐ భారీగా వెనుకేసినట్టు బయటపడుతున్నాయి. యాక్సిడెంట్ విషయం పెద్దది కావడం ఉన్నతాఽధికారులు రంగప్రవేశం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏఎస్‌ఐ కొడుకును అదుపులోకి తీసుకున్నారట.
బదిలీతో సరిపెట్టేస్తారా..?
ఏఎస్‌ఐ కంత్రి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారిద్దరి ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఏఎస్‌ఐ కొడుకు ఏపీ, తెలంగాణలో పదుల సంఖ్యలో వాహనాలను దొంగలించి విక్రయించాడు. అందులో ప్రమాదానికి గురైన కారుతోపాటు మరో ఐదు కార్లు ఏఎస్‌ఐ ఇంటి వద్దే ఉండగా పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో వాటిని పక్కకు తప్పించారు. ఏఎస్‌ఐ కొడుకు దొంగిలించిన కార్లలో నరసరావుపేట డివిజన్ పరిధిలోని పోలీసులు సైతం తిరుగుతుండటం విశేషం, ఏఎస్‌ఐ వల్ల పోలీసుశాఖకు వస్తున్న చెడ్డపేరును గమనించిన అధికారులు ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ను వెల్దుర్తి పోలీసుస్టేషన్‌కు బదిలీచేశారు. అయితే బదిలీతోనే సరిపెడతారా .. తండ్రి కొడుకులపై లోతైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఏఎస్‌ఐకి అండగా ఉంటూ, అక్రమాలు చేయించిన పోలీసు అధికారులపై చర్యలుండవా అని ఆ శాఖ సిబ్బందే చర్చించుకుంటున్నారు.


