నాయీ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి
రేపల్లె: నాయీ బ్రాహ్మణులకు రాష్ట్రంలో అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని ఏపీ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ద్రాక్షారపు సూరిబాబు అన్నారు. రేపల్లెలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయీ బ్రాహ్మణులను ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో పోలీసు, హాస్టల్స్, హెల్త్ శాఖలలో క్షౌర వృత్తి పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో నాయీ బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రభుత్వం క్షౌ రశాలలకు 200ల యూనిట్‌లు విద్యుత్ ఉచితంగా ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని, ఇది త్వరితగతిన అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు యడ్లపల్లి కిషోర్‌బాబు, కె.అప్పారావు, విజయ్, కె.శివయ్య, సుబ్రహ్మణ్యం, కె.శివబాజీ, కొడాలి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
తెనాలి రూరల్: కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి తెనాలి మీదుగా గూడూరు వరకు నిర్మించిన మూడో రైల్వే లైన్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ప్రత్యేక రైలులో సాయంత్రం తెనాలి వచ్చారు. విండో ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా జీఎం రైలులోనే ఉండి ట్రాక్‌ను పరిశీలిస్తూ ప్రయాణించారు. ఇదే రైలులో వచ్చిన విజయవాడ, గుంటూరు డీఆర్‌ఎంలు మోహిత్ సొనాకియా, సుదేష్ణసేన్ తెనాలిలో దిగిపోయారు. అమృత్ భారత స్టేషన్‌గా ఎంపికై న తెనాలి స్టేషన్ అభివృద్ధి పనులకు రూ.28 కోట్లు మంజూరు కాగా, వాటికి సంబంధించి జరుగుతున్న గూడ్స్ షెడ్డు నిర్మాణం, స్టేషన్‌లో కాలినడక వంతెనలు, ఇతర పనులను విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ సొనాకియా అధికారుల బృందంతో పరిశీలించారు. స్టేషన్ మేనేజర్ టీవీ రమణకు పలు సూచనలు చేశారు.
గుంటూరు మెడికల్: సుమారు 30 ఏళ్ల తర్వాత మళ్లీ మెడికల్ ఎగ్జిబిషన్ నిర్వహణకు గుంటూ రు మెడికల్ కళాశాల విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 2026 జనవరి 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ టైటిల్, పోస్టర్‌ను గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ సమక్షంలో అధ్యాపకులు, వైద్య విద్యార్థులు మంగళవారం ఆవిష్కరించారు. ఎగ్జిబిషనన్‌కు ‘గుంటూరు మెడికల్ కాలేజ్ మెడ్ ఫ్యూషన్’ అని నామకరణం చేశా రు. డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య సమాచారం, అవగాహన కల్పించేలా ప్రదర్శనలు ఉండాలని సూచించారు. విశిష్ట అతిథి రాజా కర్ణం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారికి రూ.లక్ష అందజేసి ఎగ్జిబిషన్ విజయవంతానికి తన మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో అడ్మిన్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, అధ్యాపకులు పాల్గొన్నారు.
వేమూరు: కో ఆప్షన్ మెంబర్ ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రైసెడింగ్ అధికారి పి.పద్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ ఆకస్మికంగా మృతి చెందడంతో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. 12 గంటలలోపు నామినేషన్ పరిశీలన, అనంతరం చెల్లుబాటు నామినేషన్ పేర్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. ఒంటి గంటలోపు నామినేషన్ ఉపసంహరణ, తర్వాత కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక జరుగుతుందన్నారు.
నాయీ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి
నాయీ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి


