
ఓపీఎస్‌లకు ఐదారు నెలలుగా జీతాల్లేవు
ఉపాధి సిబ్బందికి 4, 5 నెలలుగా అందని వేతనాలు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది కొన్ని నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచా యతీల్లో ఓపీఎస్ (ఔట్‌సోర్సింగ్ పంచాయ తీ సెక్రెటరీలు)గా పనిచేస్తున్న వారికి ఐదారునెలలుగా వేతనాలు అందడం లేదు.
వివిధ జిల్లాల్లో పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నచోట్ల..2020–21 నుంచి ఓపీఎస్‌లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నెల కు రూ.18 వేల జీతంతో నియమించారు. ఏ జిల్లాకు ఆ జిల్లా ఓ ఏజెన్సీ ద్వారా వీరి నియామకాలు చేపట్టారు. అయితే కొన్నిచోట్ల ప్రతీనెలా వేతనాలు చెల్లించే పరిస్థితులు ఉండడం లేదు. మొత్తంగా 1,500 మంది ఓపీఎస్‌లు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రీన్ చానల్... ఆచరణకు నో
గ్రీన్‌చానల్ ద్వారా వేతనాలు ఇస్తామని చెబుతున్నా, ఆచరణలో అది అమలుకు నోచుకోవడం లేదు. ఓపీఎస్‌లకు సంబంధించినంత వరకు చూస్తే ఏ ఏడాదికి ఆ ఏడాది వారి కాంట్రాక్ట్‌లు రెన్యూవల్ చేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీరిని జూనియర్ పంచాయతీ సెక్రెటరీలు (జేపీఎస్)గా కన్వర్ట్ చేయాలనే డిమాండ్ కూడా పెండింగ్‌లో ఉంది.
ఉపాధి సిబ్బందికి తిప్పలే...
ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బందికి సాంకేతిక సమస్యలతో జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని అధికారులు చెబు తున్నారు. ఈ పథకంలో 2,150 మంది టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏ), 850 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంట్స్ ఆపరేటర్లు, 340 ఈసీలు, 550 మంది అటెండర్లు పనిచేస్తున్నారు.
సాట్ (సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌ఫరెన్సీ)లో 250 మంది, కొందరు ఔట్ సోర్సింగ్‌ఉద్యోగులు కొనసాగుతున్నారు. ఈ ఉద్యోగులు, సిబ్బందికికూడా నాలుగైదు నెలలుగా జీతాలు అం దడం లేదని తెలుస్తోంది. గతంలోనూ వేత నాల చెల్లింపులు నిలిచిపోగా వారు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత వారికి కొంతకాలం పాటు జీతాలు చెల్లించినా, మళ్లీ ఇప్పుడు అదే సమస్య పునరావృతమవుతోంది.