స్మార్టుగా ఎన్నికల ప్రచారాలు!

Contestants Utilising Social Media In Municipal Elections - Sakshi

ఎన్నికల్లో సాంతికేతిక వ్యూహాలు  

ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్న నేతలు

హామీలకు వేదికగా మారిన సామాజిక మాధ్యమాలు

అన్‌ లిమిటెడ్‌ డాటాను సద్వినియోగం చేసుకుంటున్న నాయకులు    

సాక్షి, షాద్‌నగర్‌ టౌన్‌: మున్సిపాలిటీ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులు స్మార్టుగా  ప్రచారం వైపు దృష్టి సారించారు. చాలా మంది స్మార్ట్‌ ఫోన్లలో ఇంటర్‌ నెట్‌ను అధికంగా ఉపయోగిస్తుండటంతో అభ్యర్థులు అన్‌ లిమిటెడ్‌ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వార్డుల వారీగా వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసి ఓట్లను అభ్యరిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ‘ప్రజాసేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించండి, ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తాం’  అంటూ అభ్యర్ధులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఎన్నికల్లో గెలిస్తే చేపట్టే అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను తయారు చేసి వాట్సాప్, ఫేస్‌బుక్‌ సహాయంతో ఇంటింటికి ప్రతి ఓటరుకు చేరవేస్తున్నారు. అభ్యర్థుల మద్దతుదార్లు వార్డుల వారీగా ఉంటే ఓటర్లకు సంబంధించిన సెల్‌ ఫోన్‌ నంబర్లను సేకరించి వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కూర్చున్న చోటు నుంచి అభ్యర్థులు ఓటర్లుకు ఫోన్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను పలకరించడం చాలా సులభంగా మారింది. ఇంటింటి ప్రచారాలకు తోడుగా వ్యక్తిగతంగా ఫోన్‌లు చేసి పలకరిస్తే అధిక ఓట్లు రావచ్చనే భావనతో అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. 

ఓటరు జాబితాల చేరవేత  
కొంత మందికి ఓటరు జాబితాలో పేరు ఉందోలేదో అన్న విషయం తెలియదు. ఓటు ఎక్కడ వేయాలో పోలింగ్‌ కేంద్రాల గురించి ఓటర్లకు చాలా మందికి తెలియదు. దీంతో ఓటరు జాబితాలతో పాటుగా పోలింగ్‌ స్టేషన్‌ల వివరాలను వాట్సాప్‌లలో పంపిస్తున్నారు.  అదేవిధంగా ఇటీవల  ఎన్నికల సంఘం కొత్తగా రూపొందించిన పోర్టల్‌ ద్వారా సమాచారాన్ని సేకరించి అభ్యర్థులకు చేరవేస్తున్నారు.  ఓటు ఏవార్డులో ఉంది. ఏ కేంద్రంలో ఓటు వేయాలన్న విషయాలను కూడా అభ్యర్థులు ఓటర్లకు వాట్సాప్‌ల ద్వారా ఇప్పటి నుంచే సూచిస్తున్నారు. 

హామీలకు వేదిక 
ఎన్నికల ప్రచారానికి పోస్టులు తయారు చేసుకునేందుకు ఇంటర్‌ నెట్‌లో పలు యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని ఆకర్షణీయంగా ప్రచార పత్రాలను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ పని తీరు చేసిన అభివృద్ధి అంశాలను జోడించి సందేశాలు, వీడియోలు రూపొందిస్తున్నారు. కొత్తగా పోటీ చేసే అభ్యర్థులు హామీలు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు సామాజిక మాధ్యలు హామీలకు వేదికలుగా మారాయి.

ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్న విషయాలను సామాజిక మాధ్యమాల ద్వార విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో చేసే ప్రచారం కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉంది. అభ్యంతరకర అంశాల ప్రచారాల పై ఎన్నికల అధికారులతో పాటుగా, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఫిర్యాదులు స్వీకరించిన  తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

బరిలో దంపతులు
పురపోరులో భార్యభర్తలు ఇద్దరు వేర్వేరు వార్డులో కౌన్సిలర్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఇద్దరు కూడా గతంలో  మేజర్‌గ్రామ పంచాయతీలో వేర్వేరు పాలకవర్గాల్లో పంచాయతీ వార్డు సభ్యులుగా పనిచేశారు. పట్టణంలోని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గొరిగె నందరాజ్‌గౌడ్‌ 14 వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగగా.. ఆయన సతీమణి గొరిగె అన్నపూర్ణ  కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్నారు. ఇద్దరు కూడా గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసి మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
 – శంషాబాద్‌

సెంటిమెంట్‌పల్లి!
శంషాబాద్‌ పురపోరులో 25 వార్డుల్లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌   నుంచి 20 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. వీరంతా టీడీపీ నాయకులే.. టీడీపీ ప్రభావం కోల్పోవడంతో ఎన్నికల్లో ‘సైకిల్‌’ గుర్తుపై  పోటీచేసేందుకు ఇష్టపడక వీరంతా ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీని ఆశ్రయించారు. జిల్లాలోని తలకొండపల్లి మండలంలో  మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో ఏఐఎఫ్‌బీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్న తాము కూడా అదే తీరుగా ‘సింహం’ గుర్తుతో విజయఢంకా మోగించడం ఖాయమనే ధీమాతో ‘తలకొండపల్లి సెంటిమెంట్‌’ను ఇక్కడి ఏఐఎఫ్‌బీ అభ్యర్థులు గుర్తు చేసుకుంటున్నారు. పట్టణ పరిధిలో రెండు జాతీయ పార్టీల కన్నా కూడా వీరే ఎక్కువగా పోటీలో ఉండడం విశేషం,  చివరికి ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో... మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.
– శంషాబాద్‌ 

టీ తాగండి.. ఓటు వేయండి
ఆమనగల్లు పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఓ టీ స్టాల్‌ వద్ద నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు సభ్యులు స్వయంగా టీ కాచీ అక్కడే ఉన్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బైకని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులకు చాయ్‌ అందించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కార్యకర్తలు, ప్రజలకు అందరూ చాయ్‌ తాగండీ.. టీఆర్‌ఎస్‌కు ఓటేయండీ అంటూ ఎంపీ రాములు అభ్యర్థించారు. 
– ఆమనగల్లు

ఓటర్లకు పండుగ ప్యాకేజీ
పురపోరులో సంక్రాంతి పండుగ కూడా కలిసి రావడంతో ఓటర్లకు పండుగ “ప్యాకేజీ’ అందింది. పట్టణంలోని ఆయా వార్డులలో  పండుగ సందర్భంగా ఒక్కో కుటుంబానికి  ఐదు లీటర్ల మంచి నూనె, రెండు కిలోల గోధుమపిండి, కిలో శనగ పిండికి సంబంధించిన ప్రత్యేక ప్యాకెట్‌లను పట్టణంలోని పలు సూపర్‌మార్కెట్‌లలో అభ్యర్థులు తయారు చేయించారు. వీటితో పాటు కిలో మటన్, చికెన్‌లతో పాటు ప్యాకెట్‌లను ఓటర్లకు సంబంధించిన కుటుంబాలకు అందజేశారు. గట్టి పోటీ ఉన్న చోట ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కూడా ఇదే తీరుగా పండగ ‘ప్యాకెట్‌’లను అందజేయడంతో ఓటర్లకు మొత్తం మీద పండుగ ఖర్చు కాస్తా తీరింది.
–శంషాబాద్‌

తల్లీకూతుళ్ల సమరం  
ఆమనగల్లు: మున్సిపల్‌ ఎన్నికల సమరంలో తల్లీకూతుళ్లు తలపడుతున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నుంచి తల్లీకూతుళ్లు పోటీకి దిగడం విశేషం. ఎన్నికలలో 5 వ వార్డు నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పులికంటి నాగమ్మ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పులికంటి అలివేలు పోటీ చేస్తున్నారు. పోటీకి దిగిన పులికంటి నాగమ్మ, పులికంటి అలివేలు సొంత తల్లీకూతుళ్లు. ఎన్నికల సమరంలో తలపడుతున్న తల్లీకూతుళ్ళలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

పోరాడితే పోయేదేమిటి!
షాద్‌నగర్‌టౌన్‌: పోరాడితే పోయేదేమిటి అంటూ  ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేస్తే బరిలో నిలుస్తున్నారు షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన న్యాయవాది అంజయ్య.  తెల్ల వెంట్రుకల అంజయ్యగా పేరు పొందిన ఈయన 1994, 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. అదేవిధంగా 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఆయన 12వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.

ప్రస్తుతం 16వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పోటీ చేసిన అసెంబ్లీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లోనైనా విజయం లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది. అయితే ఎన్నికల్లో అతి తక్కువ డబ్బులు ఖర్చు చేసి మంచి ఆశయంతో బరిలో నిలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు    
ఇతరుల మనోభావాలు దెబ్చతినే విధంగా సామాజిక మాధ్యమాలు పోస్టింగులు చేస్తే చర్యలు తప్పవు. ఎన్నికల సమయం నేపథ్యంలో సామాజిక మాధ్యమాల పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఎన్నికల నియమావళిని ఉల్లంఘింస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. సామాజిక మాధ్యమాలు విరివిగా ఉపయోగించే వారందరు విధిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
– శ్రీధర్‌కుమార్, సీఐ, షాద్‌నగర్‌టౌన్‌                  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top