తీర్పు అమలు ఊసెత్తరేం..?

Contempt plea posted to Monday - Sakshi

అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులకు హైకోర్టు ప్రశ్న

కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణ వ్యవహారంపై నిలదీత

కార్శదర్శులిద్దరికీ 13న ఫారం–1 నోటీసులిస్తాం

తేల్చి చెప్పిన న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకరరావు

సాక్షి, హైదరాబాద్‌: ‘‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌ఏ సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా మని గత వారం చెప్పారు. అయితే ఇప్పుడు దాని గురించి ఎలాంటి ప్రస్తావనా చేయడం లేదు. తీర్పు ను అమలు చేయనందుకు అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌ రావులకు సోమవారం ఫారం–1 నోటీసులు జారీ చేస్తాం’’అని న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు తేల్చిచెప్పారు.

నోటీసులు జారీ చేయడానికి ముందు కావాలంటే వాదనలు వినిపించుకోవచ్చని వారి తరఫు న్యాయవాదులకు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఫారం–1 నోటీసులు జారీ చేసేటప్పుడు వాదనలు వినాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ అవకాశం ఇస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు.  

తీర్పు అమలుకు ప్రయత్నాలు..
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్‌ శివశంకరరావు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్‌.. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై గత వారం జరిగిన విచారణ సందర్భంగా తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ చెప్పారు. దీంతో న్యాయమూర్తి విచారణను ఈనెల 10కి వాయిదా వేశారు. ఈలోపు జస్టిస్‌ శివశంకరరావు తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి వేర్వేరుగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై అత్యవసరంగా విచారణ జరిపేందుకు నిరాకరించిన ధర్మాసనం, విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది.

వాటితో సంబంధం లేదు
కోర్టు ధిక్కార పిటిషన్‌పై జస్టిస్‌ శివశంకరరావు శుక్రవారం విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదుల వెంకటరమణ తాము దాఖలు చేసిన అప్పీళ్ల గురించి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, స్టే ఏమైనా వచ్చిందా? అని ఆరా తీశారు. స్టే రాలేదని చెప్పడంతో, అయితే ఆ అప్పీళ్లతో తనకు సంబంధం లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ‘‘గత వారం ఈ కేసు విచారణ సందర్భంగా నేను ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కాని ఇప్పుడు ఆ విషయం గురించి కనీసం ప్రస్తావనా చేయడం లేదు. తీర్పు అమలు గురించి చెప్పకుండా, అప్పీళ్ల గురించి చెబుతారేంటి’’ అని నిలదీశారు.

విచారణను వాయిదా వేయాలని వెంకటరమణ కోర గా, న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. ‘మీరేం చెప్పదలచుకున్నారో చెప్పండి.. వింటాను. నిబంధనల ప్రకారం మీ వాదనలు వినాల్సిన అవసరమే లేదు. అయినా కూడా వింటా’అని అన్నారు. దీంతో అటు వేదుల వెంకటరమణ, ఇటు న్యాయశాఖ కార్యదర్శి తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావుకు ఏం చేయాలో పాలు పోక అలా ఉండిపోయారు.

ఈ సమయంలో వేదుల వెంకటరమణ.. కనీసం సోమవారానికన్నా వాయిదా వేయాలని అభ్యర్థించడంతో న్యాయమూర్తి అంగీకరించారు. ఆ రోజున కార్యదర్శులిద్దరికీ ఫారం–1 కింద నోటీసులు జారీ చేస్తానని, దానికి ముందు వాదనలు వినిపించాలనుకుంటే వినిపించుకోవచ్చని చెప్పారు. ఫారం–1 నోటీసులు జారీ చేసేందుకు ధర్మాసనం ముందు దాఖలు చేసిన అప్పీళ్లు తమకు ఎంత మాత్రం అడ్డంకి కాదని పేర్కొన్నారు. విచారణను ఈనెల 13కి వాయిదా వేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top