
‘భూదాన్’ కేసులో తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూదాన్ భూముల అన్యాక్రాంతం, అక్రమాల ఆరోపణలపై విచారణ కమిషన్ వేయాలా? వద్దా? అనేది తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌లో తీర్పు రిజర్వు చేసింది. ఈ సర్వే నంబర్లలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు భూములను అక్రమంగా తమ పేరిట నమోదు చేసుకున్నారని, వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని దాఖలైన మరో పిటిషన్‌లోని మధ్యంతర అప్లికేషన్ల(ఐఏ)లో తీర్పు వాయిదా వేసింది.
భూకబ్జాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, దీనిపై విచారణ కమిషన్ వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్, పడమటి తండాకు చెందిన రాములు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మళ్లీ విచారణ చేపట్టారు.
తెలియకుండా భూములు మార్చేశారు..
పిటిషనర్ తరఫున డాక్టర్ జె.విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ.. ‘194/ఐ, 195/ఐలో రాములు భూములున్నాయి. ప్రస్తుతం ఆ భూములు అతని అధీనంలోనే ఉన్నాయి. పాస్‌బుక్ అతని పేరిటే ఉన్నా.. భూభారతిలో మాత్రం జావేద్, ఆర్షియా సుల్తానా, అబ్దుల్ లతీఫ్ పేర్లు చూపిస్తోంది. తనకు తెలియకుండా ఆన్‌లైన్‌లో ఎలా మార్చారో చెప్పాలని తహసీల్దార్‌ను కోరినా వివరాలు ఇవ్వలేదు. కోర్టు ఆదేశించినా స్పందనలేదు. కమిషన్ వేస్తే గానీ వివరాలు బహిర్గతం కావని కోర్టును ఆశ్రయించాం’అని తెలిపారు.
న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ‘కమిషన్ వేస్తారు.. నివేదిక వస్తుంది, అది కూడా ఉన్నతాధికారులకు సమర్పించాల్సిందే, అప్పుడు కూడా ఆ నివేదికను అల్మారాలో పెట్టి వదిలేస్తే ఏం చేస్తారు’అని ప్రశ్నించారు. మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సిందేనని న్యాయవాది బదులిచ్చారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వ్యక్తిగత అంశాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం సాధ్యం కాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్‌లో తీర్పు రిజర్వు చేశారు.