మరణశయ్యపై కానిస్టేబుల్‌

Constable on the deathbed - Sakshi

చావు కోసం ఎదురుచూపులు  

 కొనలేక మందులు మానేశాడు   

కేన్సర్‌ కోరల్లో చిక్కుకున్న జోయల్‌ 

పెద్దపల్లి: ‘చనిపోయేవాడికి అప్పెవరిస్తారు.. అయినా.. అప్పు తీసుకుంటే నేనెలా చెల్లిస్తా’ నంటూ కేన్సర్‌ వ్యాధితో బాధ పడుతున్న కానిస్టేబుల్‌ జోయల్‌ డేవిస్‌ ఇక బతకనని తెలిసి మందులు మానేశాడు. మందులకు నెలకు రూ. 2 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో అంత సొమ్ము పెట్టి మందులు కొనే స్థోమత లేక ఆస్పత్రి ముఖం చూడకుండా చావు కోసం ఎదురుచూస్తున్నానని కన్నీటి పర్యంతమవుతున్నాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన జోయల్‌ 25 ఏళ్ల పాటు కానిస్టేబుల్‌గా పని చేశారు. విధినిర్వహణలో నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు. అద్దె ఇంట్లో ఉంటున్న జోయల్‌ 20 నెలల క్రితం దగ్గుతో బాధ పడుతూ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఊపిరితిత్తుల కేన్సర్‌గా గుర్తించటంతో హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు.

అక్కడి వైద్యులు రోజుకు రూ. 20 వేల విలువైన ఓ ట్యాబ్లెట్‌ వాడాలని, అలా మూడు నెలలు వాడాల్సి ఉంటుందని సూచించారు. వారు చెప్పిన లెక్కల ప్రకారం మూడు నెలల మాత్రలకు రూ. 18 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. నెల జీతం ఒకరోజు మాత్రకే సరిపోతుండడంతో 90 రోజుల ట్యాబెట్లు ఎలా కొనుగోలు చేస్తానంటూ ఆస్పత్రి వైపు వెళ్లడం మానుకున్నాడు. నిబంధనల ప్రకారం పోలీసు శాఖ ఆరు నెలలపాటు వేతనం చెల్లించింది.  ఆ తర్వాత వేతనం నిలిపివేయటంలో  కుటుంబం గడవటమే కష్టంగా మారింది.  అప్పులిచ్చేవారు కూడా లేకపోవడంతో ఇక వైద్యం చేయించుకోవడం మానేశాడు.

తనకు కేన్సర్‌  నాల్గో దశలో ఉందని ఇండో అమెరికన్‌ ఆస్పత్రి వైద్యులు వెల్లడించి ఆరు నెలలు గడిచిపోయిందన్నారు. అప్పుడే చనిపోతానని చెప్పారని, ఇక అప్పులు చేసి పిల్లలకు భారం మిగల్చవద్దని చావు కోసమే ఎదురు చూస్తున్నానన్నారు.  జోయల్‌ ఇద్దరు పిల్లలు వేరొనికా, జాన్‌పాల్‌లు ఎవరైనా ఇంటికి వస్తే ‘అంకుల్‌.. డాడీ చనిపోతాడా’అని అడగటం చూస్తే గుండెలను పిండేస్తోంది. మానవతాహృదయులు స్పందించి ఆసరాగా నిలుస్తారని జోయల్‌ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top