ఎవరు..?

Congress Party Searching For DCC President Candidate - Sakshi

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడింది కాంగ్రెస్‌ పార్టీ. అందులో భాగంగానే నూతన జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, ఇతర కార్యవర్గాలను ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉన్నా పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో వాయిదా పడుతూ వచ్చింది. పార్టీ అధినేత, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈనెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో మరోసారి కసరత్తు మొదలైంది. రాహుల్‌ పర్యటన తర్వాత నూతన కమిటీలను ప్రకటించాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ యోచిస్తోంది. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో స్తబ్దుగా ఉన్న నాయకులు... తామూ డీసీసీ రేసులో ఉన్నామని అనుచరుల ద్వారా చెప్పించుకోవడం.. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా తామూ రేసులో ఉన్నామని సంకేతాలు పంపుతున్నారు.           
–సాక్షి, సిద్దిపేట

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంలో కీలకమైన మంత్రి హరీశ్‌రావులు ప్రాతినిథ్యం వహించే సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని నడిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు. వారిని ఢీకొనే సత్తా ఉన్న నాయకుడి కోసం కాంగ్రెస్‌లో వేట మొదలైంది. ఇందులో భాగంగానే జిల్లాలోని సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి ముత్యంరెడ్డి, మరో పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రవన్‌కుమార్‌రెడ్డి, సిద్దిపేట నియోజకవర్గం ఇన్‌చార్జి తాడూరి శ్రీనివాస్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌ వర్మలతోపాటు ఇటీవల పార్టీలో చేరిన గజ్వేల్‌కు చెందిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరుల పేర్లు పరిశీలించినట్లు సమాచారం. అయితే ఇందులో శ్రవన్‌కుమార్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిలు తమకు డీసీసీ పదవి వద్దని అధిష్టానానికి ఇప్పటికే తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

అదేవిధంగా ముత్యంరెడ్డి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ముందస్తు కసరత్తు అవసరమని, జిల్లా అంతా మీద వేసుకొని పార్టీని నడిపిస్తే నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేమోనని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ సిద్ధాంతాల ప్రకారం ఒక్కరికి ఒకే పదవి ఉండాలనే కొత్త నిబంధన కూడా ఉండనే ఉంది. హుస్నాబాద్‌ నుండి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బొమ్మా శ్రీరాం చక్రవర్తిలు కూడా ఎమ్మెల్యే టిక్కెటే కావాలి.. డీసీసీపై పెద్దగా సానుకూలంగా స్పందించడం లేదనే వార్తలు వినవస్తున్నాయి..  

పావులు కదుపుతున్న ఆశావాహులు..  
పార్టీ కోసం ఇంతకాలం పనిచేశాం... ఉమ్మడి జిల్లాలో హేమాహేమీలు ఉండటంతో పార్టీ పదవులు రాలేదని.. ఇప్పుడు జిల్లా వేరు కావడంతో డీసీసీ పదవి దక్కించుకునేందుకు పలువురు నేతలు తమ గాడ్‌ ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన నాకు సిద్దిపేట పట్టణంతోపాటు, జిల్లాలోని అన్ని ప్రాంతాలతో పరిచయం ఉందని ఎమ్మెల్యే టిక్కెట్‌తోపాటు డీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వాలని తాడూరు శ్రీనివాస్‌ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్‌ల ద్వారా పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

సిద్దిపేట పట్టణంలో తనకు పట్టుందని.. పగ్గాలు తన చేతికిస్తే పార్టీని బలోపేతం చేస్తానని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌ వర్మ ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులను కలిసి చెప్పినట్లు తెలిసింది. అదేవిధంగా వర్మకు డీసీసీ ఇవ్వాలని షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్యలు ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడికి  రెకమండ్‌ చేసినట్లు సమాచారం.. అదేవిధంగా ఢిల్లీ నాయకులతో ఉన్న సంబంధాలను కూడా ఉపయోగించుకొని పార్టీ పగ్గాలు కైవసం చేసుకునేందుకు వర్మ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.  సిద్దిపేటకు చెందిన మరో నాయకుడు గంపా మహేందర్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హన్మంతరావు ద్వారా ప్రయత్నిస్తున్నారు.

పూజల హరికృష్ణ కూడా తనకు డీసీసీ ఇవ్వాలని తన అనుచరుల ద్వారా అధిష్టానానికి చెప్పిస్తున్నట్లు తెలిసింది. వీరితోపాటు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు బండి నర్సాగౌడ్‌ కూడా డీసీసీ అధ్యక్ష పదవిపై కన్నేసి గాంధీభవన్‌లో పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్లు ప్రచారం. వీరితోపాటు హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కేరం లింగమూర్తి కూడా తనకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉందని చెబుతూ గాడ్‌ ఫాదర్స్‌ ద్వారా పావులు కదుపుతున్నారు. 

స్థానికంగా నివాసం ఉండే వారైతే.. 
టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న సిద్దిపేటలో పార్టీని నిలబెట్టాలంటే స్థానికంగా నివాసం ఉండేవారికే డీసీసీ పదవి అప్పగిస్తే బాగుంటుందని పార్టీ హైకమాండ్‌ భావిస్తోంది.  పార్టీ కార్యాలయం, కార్యకర్తల సాదకబాధలు పట్టించుకునే నాయకులకు అవకాశం ఇస్తే పార్టీ నిలబడుతుందని జిల్లా కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో సిద్దిపేట పట్టణానికి చెందిన కార్యకర్తలతో మమేకమయ్యే వారికే డీసీసీ పదవి దక్కే అవకాశం ఉందని.. లేని పక్షంలో సీనియర్‌ నాయకుడు ముత్యం రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. ఆయనకున్న అనుభవం రాబోయే సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడుతుందని పీసీసీ ఆలోచిస్తుందని సమాచారం. ఏదేమైనా రాహుల్‌ పర్యటన ముగిసేవరకు ఉత్కంఠగా  వేచి చూడక తప్పని పరిస్థితి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top