ఎవరికి వారే..

Congress Leaders Fighting For MLA Seats - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: మహాకూటమి పొత్తుల లెక్కలు తేలలేదు... ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో అర్థం కాని పరిస్థితి... టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు... ఈ పరిస్థితిల్లో ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్‌ ఆశావహులు ముందస్తు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎవరికి వారే ‘పార్టీ టికెట్టు నాదే... పోటీ చేసేది నేనే’ అనే ధీమాతో ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ధీటుగా ప్రచారాన్ని కొనసాగించే పనిలో పడ్డారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరికి మించి కాంగ్రెస్‌ పార్టీ జెండాలతో ప్రచారం చేస్తుండడంతో ఓటర్లు అయోమయంలో పడుతున్నారు. ఎవరికి వారే ‘టికెట్టు నాదే’ అని గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం.

మంచిర్యాలలో కొక్కిరాల... అరవింద్‌రెడ్డి
మంచిర్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు 2014 ఎన్నికల్లో సిర్పూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఓటమి తరువాత భవిష్యత్తు రాజకీయానికి మంచిర్యాలను ఎన్నుకొన్నారు. అప్పటినుంచి మంచిర్యాల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్టు నుంచి పోటీ చేసేది తానేనని పేర్కొంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. రెండేళ్లుగా ప్రేంసాగర్‌రావు తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ ద్వారా ప్రభుత్వ పథకాలకు పోటీగా సొంత ఖర్చుతో ప్రజలకు బతుకమ్మ చీరలు, రంజాన్‌ తోఫా పేరిట పంపకాలు జరుపుతున్నారు.

యువజన, మహిళా, కుల సంఘాలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేపట్టారు. ఇక ప్రస్తుతం టికెట్టు తనదే అనే ధీమాతో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావుకు పోటీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి సైతం టికెట్టు తనదే అనే ధీమాతో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ తనదే టికెట్టు అని స్పష్టం చేసిన ఆయన మండలాలలో ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఎవరికి వారే తమ అనుచరవర్గాన్ని కాపాడుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు.

సిర్పూరు ప్రచారంలో హరీష్‌బాబు ముందంజ
సిర్పూరు మాజీ ఎమ్మెల్యే, దివంగత పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీష్‌బాబు ఆరునెలల ముందు నుంచే ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఇండిపెండెంట్‌గా రెండుసార్లు గెలిచిన తన తండ్రి అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించి ప్రచారం ప్రారంభించిన హరీష్‌బాబు కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు రెండు నెలల క్రితం అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటినుంచి కాంగ్రెస్‌ కండువాలతో గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్పకు ధీటుగా హరీష్‌ ప్రచారాన్ని నిర్వహిస్తుండడం గమనార్హం. కాగా ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టికెట్టు ఆశిస్తున్న రావి శ్రీనివాస్‌ కూడా తన వర్గాన్ని ప్రచారంలోకి దింపారు. ఇటీవల రాహుల్‌గాంధీ భైంసా బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ జరిపిన రావి శ్రీనివాస్‌ టికెట్టు తనకేనని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇద్దరు నేతలు ఎవరికి వారే తమకు టికెట్టు ఖాయమనే చెప్పుకుంటుండం గమనార్హం. ఈ నియోజకవర్గంలో బీసీ కార్డుతో శ్రీనివాస్‌యాదవ్‌ సైతం టికెట్టు వేటలో ఉండడం గమనార్హం.

చెన్నూరులో వెంకటేష్‌ నేత... బోడ జనార్దన్‌
చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ అధిష్టానానికి దగ్గరైన ఓ నేత సిఫారసుతో గ్రూపు1 అధికారిగా రాజీనామా చేసిన బోర్లకుంట వెంకటేష్‌ నేత ఇప్పటికే కాంగ్రెస్‌ కండువాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్‌ఎస్‌ అసంతృప్తి నాయకులను దరికి చేర్చుకుంటూ తానే అభ్యర్థిగా ప్రతిరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌కు ధీటుగా ప్రచారం సాగిస్తున్న వెంకటేష్‌ నేత తనకే టికెట్టు ఖాయమని చెప్పుకుంటున్నారు. కాగా నియోజకవర ్గంలో సీనియర్‌ నేత, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోడ జనార్ధన్‌ కూడా కాంగ్రెస్‌ టికెట్టు తనకే నన్న ధీమాతో ఉన్నారు. ఆయన తనదైన శైలిలో గ్రామాలు, మండలాలకు చెందిన పాత తెలుగుదేశం నాయకులను కలుస్తూ , కాంగ్రెస్‌ టికెట్టు తనకే వస్తుందని చెప్పుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు.

ఆదిలాబాద్‌లో ముక్కోణపు పోటీ
ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, గండ్రత్‌ సుజాత, భార్గవ్‌ దేశ్‌పాండేల మధ్య టికెట్టు కోసం ముక్కోణపు పోటీ నెలకొంది. పాత తరం నాయకుడిగా రామచంద్రారెడ్డి చివరి అవకాశంగా తనకు టికెట్టు ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థించి తన వంతు ప్రచారం సాగిస్తున్నారు. మంత్రి జోగు రామన్నను ఢీకొని నిలబడేది తానే అంటూ రామన్న సామాజిక వర్గానికి చెందిన గండ్రత్‌ సుజాత టికెట్టు వేటలో ఉన్నారు. ఆమె తన ప్రచారాన్ని మండలాల స్థాయిలో ఇప్పటికే ప్రారంభించి ముందుకు సాగుతున్నారు. యువ నాయకుడు , గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన భార్గవ్‌ దేశ్‌పాండే డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అండదండలతో తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ముథోల్‌లో పటేల్‌ల మధ్య పోటీ
మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, ఆయనకు సోదరుడి వరుసైన రామారావు పటేల్‌ మధ్య ముథోల్‌ సీటు దోబూచులాడుతోంది. ఇటీవలి రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయడంలో ఇద్దరు నేతలు కష్టపడ్డా, నాలుగేళ్లుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామారావు పటేల్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఎవరికి వారే తమ అనుచరవర్గాన్ని కాపాడుకుంటూ ముథోల్‌ నుంచి సీటు తెచ్చుకొనే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. రాహుల్‌గాంధీ సభలో బల ప్రదర్శనకు కోసం ఇద్దరు నాయకులు కష్టపడ్డారు.

  • బెల్లంపల్లి చిలుముల శంకర్‌తో పాటు టికెట్టు ఆశిస్తున్న శారద ప్రచారం నిర్వహిస్తుండగా, అధిష్టానం ఆశీస్సులతో గద్దరు తనయుడు సూర్యకిరణ్‌ సీటు పొందే ప్రయత్నాల్లో ఉన్నారు.
     
  • బోథ్‌లో నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి అనిల్‌ జాదవ్‌ డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అండదండలతో ప్రచారం సాగిస్తుండగా, మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ద్వారా టికెట్టు పొందా లని భావిస్తున్నారు. వీరిద్దరు ఎవరికి వారు ని యోజకవర్గంలో ప్రజల వద్దకు వెళుతున్నారు.
     
  • ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్‌ టికెట్టు ఆశించి భంగపడ్డ రాథోడ్‌ రమేష్‌ కాంగ్రెస్‌లో చేరి పాత సంబంధాలతో ప్రచారం జరుపుతున్నారు. టికెట్టు కోసమే కాంగ్రెస్‌లో చేరినట్టు చెపుతున్న ఆయన పోటీలో నిలిచేది తానే అనే ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన హరినాయక్, ఇటీవల పార్టీలో చేరిన చారులతతో పాటు మరి కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా టికెట్టు రేసులో తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎవరికి వారే తమకే టికెట్టు ఖాయమనే ధోరణిలో ఉండడం గమనార్హం. 

టికెట్‌ రాకుంటే రెబల్‌గానే..!

మంచిర్యాలలో టికెట్టు రేసులో ఉన్న ప్రేంసాగర్‌రావు, అరవింద్‌రెడ్డిలలో ఎవరికి టికెట్టు రాకపోయినా, ఇండిపెండెంట్‌గా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. చెన్నూరులో వెంకటేష్‌ నేతకు టికెట్టు ఇస్తే బీఎస్పీ లేదా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగే ఆలోచనలో బోడ జనార్ధన్‌ ఉన్నట్లు సమాచారం. సిర్పూరులో ఇండిపెండెంట్‌గానే పోటీ చేయాలని భావించి బరిలోకి దిగిన హరీష్‌బాబు ఒకవేళ సీటు రాకపోతే ఇండిపెండెంట్‌గానే బరిలో ఉండడం ఖాయం. హరీష్‌కు సీటొస్తే రావి శ్రీనివాస్‌ కూడా పోటీలో ఉంటారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు.

బోథ్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ సోయం బాపూరావు ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని ప్రకటించారు. ఖానాపూర్‌లో కూడా టికెట్టు రాని వారిలో ఒకరైనా రెబల్‌గా నిలబడే అవకాశం ఉంది. మిగతా నియోజకవర్గాల్లో టికెట్టు రానివారు రెబల్స్‌గా పోటీ చేయకపోయినా, ప్రత్యర్థి శిబిరాలకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ టికెట్ల ప్రకటన తరువాత తమకు నియోజకవర్గాల్లో అనుకూలత పెరుగుతుందని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు యోచిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top