కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నీటిని మెదక్‌కు ఎప్పుడు తెస్తారో ?

Congress Fires on TRS Government In Medak - Sakshi

సాక్షి, మెదక్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి నీటిని మెదక్‌కు ఎప్పుడు తెస్తారో.. టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమకుమార్‌ డిమాండ్‌ చేశారు. మరో 20ఏళ్లు గడిచినా ఆ నీరు మెదక్‌కు వచ్చే ప్రసక్తి లేదన్నారు.  రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో 70శాతం సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నయమంటూ కొందరు నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని, మొన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కూడా పోటీ చేయలేనివారు.. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం ఎలా అవుతుందన్నారు. కేసీఆర్‌ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌పార్టీకి ఘనమైన చరిత్ర ఉందని, చిరంజీవిలా ఎప్పుడూ వికసిస్తూనే ఉంటుందననారు. మెదక్‌జిల్లాకు ఇందిరమ్మ పేరు పెట్టాలని కోరడం జరిగిందన్నారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల వల్ల కుదురలేదన్నారు.

కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి..డబ్బులు సంపాదించి నేడు పార్టీలు మారుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పేర్కొన్నారు. శనివారం మెదక్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక క్రిస్టల్‌ గార్డెన్స్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోసురాజు మాట్లాడుతూ పార్టీ మారిన నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లో చేరే విధంగా పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఇందుకోసం జిల్లా మండల, నియోజకవర్గ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల బీఫాంల విషయంలో పీసీసీ, ఏఐసీసీ తలదూర్చదని తెలిపారు 

డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన విధంగా కాంగ్రెస్‌లో అనేక పదవులు అనుభవించి, నేడు పార్టీ మారినవారు నీతిమాలిన వారన్నారు. కానీ నాయకులు మాత్రమే పార్టీలు మారుతున్నారు తప్ప..కార్యకర్తలు కాదన్నారు. పార్టీలో ఎలాంటి గ్రూప్‌లు లేవని, అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు. మెదక్‌ జిల్లా నుంచి అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఇతర జిల్లాలకు తరలిపోయాయని, ప్రస్తుతం మహిళా డిగ్రీ కళాశాల సైతం తరలిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. అదే జరిగితే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.

స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఐదేళ్లుగా మెదక్‌లో రోడ్డు పనులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.  సింగూర్‌ జలాలను ఎలాంటి జీఓ లేకుండా కేటీఆర్‌ నియోజకవర్గంలోని శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌కు తరలించి ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్షించారు. తాము అధికారంలోకి రాగానే ఎన్డీఎస్‌ఎల్‌ను స్వాధీనం చేసుకుంటామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రెటరి మ్యాడం బాలకృష్ణ, నాయకులు మామిళ్ల ఆంజనేయులు, మధుసూదన్‌రావు, పోతరాజు రమణ, ఆవుల గోపాల్‌రెడ్డి, లక్ష్మి, కిష్టయ్య తదితరులు ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top