‘దేశం’లో ఐవీఆర్‌ఎస్ ముసలం | Congress, efficient dharmasri, the other hand, | Sakshi
Sakshi News home page

‘దేశం’లో ఐవీఆర్‌ఎస్ ముసలం

Mar 18 2014 1:47 AM | Updated on Aug 10 2018 8:01 PM

‘దేశం’లో ఐవీఆర్‌ఎస్ ముసలం - Sakshi

‘దేశం’లో ఐవీఆర్‌ఎస్ ముసలం

‘మీకు నచ్చినోడే.. మా అభ్యర్థి’ అంటూ, అందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) ద్వారా ప్రజాభీష్టాన్ని....

సాక్షి,సిటీబ్యూరో/న్యూస్‌లైన్ కుత్బుల్లాపూర్:  ‘మీకు నచ్చినోడే.. మా అభ్యర్థి’ అంటూ, అందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) ద్వారా ప్రజాభీష్టాన్ని తెలుసుకుంటామన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిజంగానే ప్రజాభిప్రాయం ద్వారా అభ్యర్థిని ఎంపిక చేస్తారా? లేక తనకు నచ్చినవారినే అభ్యర్థిగా నిలిపేందుకు వేసిన కొత్త ఎత్తుగడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘గ్రేటర్’లోని కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లోని కొందరికి సోమవారం ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఫోన్ వచ్చింది. దాని ద్వారా తమ అభిప్రాయం తెలియజేయాలనుకున్నవారు తెల్ల మొహం వేయాల్సి వచ్చింది.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి దిగువవారిలో ఎవరు మీ అభ్యర్థి అయితే బాగుంటుందని ఆరా తీశారు. అందులో  కేపీ వివేకానంద్‌గౌడ్, కూన వెంకటేశ్‌గౌడ్, అరవింద్‌కుమార్‌గౌడ్ పేర్లు ఉన్నాయి. వీరిలో ఎవరి పేరుకైనా ఆమోదం తెలపాలం టే.. సంబంధిత నెంబరు నొక్కాలి. ఎవరూ నచ్చకపోయి నా ఆ అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. తమకు నచ్చినవారి పేరు చెప్పవచ్చు. కాగా, వీరిలో కూన వెంకటేశ్‌గౌడ్, అరవింద్‌కుమార్‌గౌడ్ తమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని స్థానికులెవరూ ఊహించలేదు. అందుకు కార ణం వారు ఆ నియోజకవర్గానికి చెందినవారు కాదు.

ఈ పరిస్థితుల్లో వారి పేర్లు విన్న వారు బిత్తరపోయారు. ఇది ఒకవైపు దృశ్యం కాగా.. మరోవైపు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా కేపీ వివేకానందగౌడ్‌ను 2010లో షాపూర్‌లో జరిగిన రోడ్‌షో కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు తాను ఇచ్చిన మాటను తానే వెనక్కు తీసుకుంటున్నారా? లేక ఐవీఆర్‌ఎస్ సాకుతో ఇష్టంలేని వారిని అసెంబ్లీ బరి నుంచి తొలగించనున్నారా? అన్న సందేహాలు టీడీపీ కార్యకర్తల నుంచి వ్యక్తమయ్యాయి.

ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే ఆశతో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాలు చేస్తున్న  కొందరు టీడీపీ నేతలు సైతం తాజా తీరుతో ఆందోళనలో మునిగారు. తమకే టిక్కెట్టు వస్తుందని ఇప్పటికే ఎంతో ఖర్చు చేశామ ని, ఇప్పుడు ఐవీఆర్‌ఎస్ పేరుతో తమను కాదంటే పరిస్థితేమిటని వారు అయోమయంలో పడ్డారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జులుగా ఉన్నవారికే సంబంధిత నియోజకవర్గ టిక్కెట్ వస్తుందనే నమ్మకం ఇప్పటి దాకా ఉంది. తాజా పరిణామాలతో  గ్రేటర్‌లోని పలువురు ఇన్‌ఛార్జులు సైతం ఒక్కసారిగా కంగు తిన్నారు. ఐవీఆర్‌ఎస్ పేరిట టిక్కెట్ ఇవ్వకుండా కొంప ముంచుతారా అని వారు  భయాందోళనలకు గురవుతున్నారు.
 
స్థానికేతరుల కోసమా?
 
కూకట్‌పల్లి నుంచి మాధవరం కృష్ణారావు ఒక్క పేరుపైనే ఆరా తీశారని, ఫోన్ అందుకున్న వారు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీకి మరో అభ్యర్థే కరువయ్యారా లేక ఆయన పేరుకు ప్రజాస్పందన లేదనే సాకుతో స్థానికేతరులను తెస్తారా? అనే ఊహాగానాలూ సాగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement