కొసరుకు కొండంత | Compensation for the delay in the distribution | Sakshi
Sakshi News home page

కొసరుకు కొండంత

Dec 6 2014 2:47 AM | Updated on Sep 2 2017 5:41 PM

కొసరుకు కొండంత

కొసరుకు కొండంత

మంథని గాంధీచౌక్ నుంచి సామాజిక వైద్యశాల, రావులచెరువుకట్ట, మందాట, పెంజెరుకట్ట మీదుగా గాంధీచౌక్ వరకు రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.4.09 కోట్లు కేటాయించింది.

 మంథని : మంథని గాంధీచౌక్ నుంచి సామాజిక వైద్యశాల, రావులచెరువుకట్ట, మందాట, పెంజెరుకట్ట మీదుగా గాంధీచౌక్ వరకు రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.4.09 కోట్లు కేటాయించింది. ఈ రహదారిలో పురాతణమైన కట్టడాలు ఉండటంతో నిర్మాణదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ పలుమార్లు చర్చలు జరిపి 32 నుంచి 30 ఫీట్లకు, ఆ తర్వాత 28 ఫీట్లకు తగ్గించి విస్తరణకు శ్రీకారం చుట్టారు.
 
  పరిహారం పంపిణీలో ఆలస్యం జరగడంతో పనులు కొద్దినెలలు ఆగిపోయాయి. తిరిగి పనులు ప్రారంభమైనప్పటికీ కాంట్రాక్టర్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా నాణ్యతను విస్మరిస్తున్నాడు. 28 ఫీట్లు విస్తరించి అభివృద్ధి పనులు చేయాల్సి ఉండగా ఓ చోట 26 ఫీట్లు, మరో చోట మరో విధంగా విస్తరించి మురికి కాలువల నిర్మాణం చేపడుతున్నాడు. నిర్మాణాలు కోల్పోతున్న వారికి సుమారు రూ.2 కోట్ల చెల్లింపులు జరిగాయి. కనీసం ఒక్క ఫీటు సెట్‌బ్యాక్‌తో మురికి కాలువలు చేపట్టాల్సి ఉండగా, ఇంటి గోడల్లోనే నిర్మాణం చేస్తున్నారు. కాలువ పనులు సైతం ఇష్టారీతిలో చేస్తున్నారు.
 
 ఒక్కోచోట కనీసం పేరుకుపోయిన చెత్తను బయటకు తీసేందుకు ఉపయోగించే చిన్నపాటి పార కూడా పట్టనంత వెడల్పులో నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. నిర్మాణాల తొలగింపు విషయంలో నిబంధనలను విస్మరించడంతో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విస్తరణ పనులను మొదట్లో లేకపోతే చివరి నుంచి ప్రారంభించాల్సి ఉండగా ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీరాజ్ ఎస్‌ఈ, డీఈలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితి మారడం లేదని పలువురు వాపోతున్నారు.
 
 ఆరు ఇంచుల పిల్లర్‌కు రూ.2లక్షలా?
 రోడ్డు విస్తరణ, అభివృద్ధి విషయంలో అధికారులు అక్రమాలకు పాల్పడతున్నారు. ఆరు ఇంచుల పిల్లర్ పోయిన వారికి రూ.2లక్షలు ఇచ్చి పెద్ద మొత్తంలో నష్టపోతున్న వారికి రూ.వేలల్లో పరిహారం మంజూరీ చేశారు. ఈ విషయంపై పలుమార్లు పంచాయతీరాజ్ ఎస్‌ఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.         
 - గుడి అశోక్
 
 70 ఫీట్లు పోతున్నా రూ.2.45 లక్షలే..
 ఏడు దర్వాజలు, ఒక షెట్టరు, ఇల్లు, కమాన్ దర్వాజతో కలిసి 70 ఫీట్ల వరకు రోడ్డు వెడల్పులో నష్టపోతానం. మాకు కేవలం రూ.2.45 లక్షల పరిహారం మంజూరు చేసిండ్రు. ఆ చెక్కును ఇంకా మా చేతికి ఇయ్యలేదు. మేం ఇంట్లో లేనప్పుడు మాకు సమాచారం ఇయ్యకుండా ఇల్లు కూల్చుతామని బెదిరిస్తుండ్రు. నష్టపరిహారం ఇయ్యకుండా ఇల్లు కూల్చితే  మా గతేం కావాలె? - పాపిట్ల నందు
 
 సంబంధం లేనివారి పేరిట చెక్కు
 ఐదు ఫీట్ల వెడల్పుతో 12 ఫీట్ల పొడవుతో ఖాళీ స్థలం, రెండు బాత్రూంలు రోడ్డు విస్తరణలో కోల్పోతున్నం. మాకు కేవలం రూ.29 వేలు నష్టపరిహారం మంజూరు చేసిండ్రు. అది కూడా మా పేరిట కాకుండా సంబంధం లేని మరో వ్యక్తి పేరిట చెక్కు జారీ చేసిండ్రు. ఆర్డీఓకు ఫిర్యాదు చేసి మూడు నెలలైనా ఏ ఒక్క అధికారి వచ్చి విచారణ చేయలేదు.   
 - వడ్లకొండ రవి
 
 అక్రమాలకు ఆస్కారం లేదు
 అంతర్గత రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల్లో అక్రమాలకు ఆస్కారం లేదు. ఈ వ్యవహారంలో ఎవరైనా డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం. కొత్తగా నిర్మించిన కొన్ని భవనాల విషయంలో ఒకటి రెండు ఇంచుల తేడా ఉంటే మానవతాదృక్పదంతో వదిలివేశాం.          
 - చంద్రశేఖర్, డీఈఈ, పీఆర్, మంథని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement