మేడిగడ్డ బ్యారేజ్‌ వద్ద సీఎం కేసీఆర్‌

CM KCR Visits Kaleshwaram Project - Sakshi

సాక్షి, జగిత్యాల: రాష్ట్ర సాగునీటి రంగ ముఖచిత్రాన్ని మార్చే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటి ఎత్తిపోతలకు రంగం సిద్ధమైంది. అన్నీ కుదిరితే ఈ నెల 20 నుంచే గోదావరి వరదను ఒడిసిపట్టేలా నీటి పారుదల శాఖ ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే సిద్ధమైన పంపుల ద్వారా తొలి దశలో అర టీఎంసీ నీటిని ఎత్తిపోస్తూ, క్రమంగా వచ్చే నెల ఇరవై నాటికి పూర్తి స్థాయిలో 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కార్య ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు (మంగళవారం) ఎస్సార్సెస్పీ పునర్జీవ పథకం పనులు, మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు.

తన పర్యటనలో భాగంగా మొదట ఆయన జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌ వరద కాల్వ వద్ద నిర్మిస్తున్న పంప్‌హౌస్‌ వద్దకు చేరుకున్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ పంప్‌హౌస్‌ మొదటి మోటర్‌కు ఇటీవల డ్రైరన్‌ నిర్వహించగా అది విజయవంతం అయింది. ఇక్కడ 8 పంపులలో 4 సిద్ధమయ్యాయి. ఈ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. అధికారులకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకొని అక్కడి పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ప్రాజెక్టు పరిసరాల్లో తిరిగి.. పనులు జరుగుతున్న తీరును స్వయంగా తెలుసుకున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి.. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, ఇంజినీర్లు, వర్క్‌ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి.. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు మార్గనిర్దేశం చేస్తారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top