ఇద్దరా..! ముగ్గురా..! 

CM KCR Strong Warning To TRS MLAs - Sakshi

సాక్షి, కొత్తగూడెం : ‘నియోజకవర్గాల్లో విపత్కర పరిస్థితులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటే ఎవరూ కాపాడలేరు.’ అని సీఎం కేసీఆర్‌ అధికార పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించిన నేపథ్యంలో.. జిల్లాలోని  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. పలుమార్లు సర్వేల ద్వారా స్థానిక పరిస్థితులను తెలుసుకుని పనితీరు బాగాలేదని సీఎం హెచ్చరించిన 39 శాసనసభ్యుల్లో జిల్లాకు చెందిన వారు కూడా ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  గతంలో చేసిన సర్వేల్లోనూ ఎక్కువమంది రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పడం, జిల్లాలోని 5 అసెంబ్లీ సీట్లలో 4 సీట్లు రిజర్వుడు సీట్లే కావడంతో..

 ఇక్కడి ఎమ్మెల్యేల్లో, పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే  జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కుటుంబసమేతంగా హైదరాబాద్‌ పిలిచి ముఖ్యమంత్రి హెచ్చరించినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల పార్టీపై ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలపై వస్తున్న వ్యతిరేకత వల్ల కొంపమునిగే పరిస్థితి ఉందని.. తక్షణమే సానుకూల పరిస్థితి తెచ్చుకునేలా బలం పెంచుకోవాలని అధినాయకత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో పంచా యతీ ఎన్నికల జరిగే అవకాశం ఉండడం, సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండడంతో ఇప్పటికే పొలిటికల్‌ ఫీవర్‌ నడుస్తోంది. 

అన్నిచోట్లా గ్రూపు రాజకీయాలు  
ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక్క కొత్తగూడెం స్థానంలో మాత్రమే టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. భద్రాద్రి జిల్లా విషయానికి వస్తే అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు వైఎస్సార్‌సీపీ నుంచి, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కాంగ్రెస్‌ నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి పలువురు జిల్లా, మండల, స్థానిక నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం లో పలువురు చేరారు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున చేరారు. దీంతో దాదాపు అన్ని మండలాల్లో అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో వలస వచ్చిన ఎమ్మెల్యేలపై ఉద్యమకారులు, వలస వచ్చిన కొందరు అధికార పార్టీ నాయకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. 

ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పెత్తనం  
జిల్లాలోని ఓ రెండు నియోజకవర్గాలకు చెందిన(వలస వచ్చిన) ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు అన్ని విషయాల్లో పెత్తనం చేస్తున్నారని అధికార పార్టీకే చెందిన కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఒక నియోజకవర్గంలో అన్ని పనులు ఎమ్మెల్యే కుటుంబసభ్యులే కేటాయింపులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పర్సంటేజీలకు పనులు కేటాయిస్తున్నట్లు కార్యకర్తలే వాపోతున్నారు. ఇక మరో నియోజకవర్గంలో బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారాలతో పాటు, ఇసుక క్వారీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల వద్ద పర్సంటేజీల వ్యవహారాల్లో నేరుగా సదరు ఎమ్మెల్యే కుటుంబసభ్యులే కథ నడిపిస్తున్నారని తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి.

ఇక మిషన్‌ కాకతీయ పనులు, మున్సిపాలిటీలో వచ్చిన 70 రోడ్డు పనుల్లో 60 పనులు బినామీకే అప్పగించారని పలువురు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక కార్యకర్తలకు ఇచ్చిన పనుల్లోనూ ముక్కుపిండి మరీ 10శాతం పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. పైగా సదరు ఎమ్మెల్యేకు నియోజకవర్గంలోని ఏ ఒక్క జెడ్పీటీసీతోనూ సఖ్యత లేకపోవడం తీవ్రతను చెబుతోంది. ఇంకో ఎమ్మెల్యేపై కూడా వ్యతిరేకత ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.  ఈ నేపథ్యంలో సర్వే నివేదికలు రావడం, అందులో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తుండడంతో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 

ఎంపీ పొంగులేటి బుజ్జగింపులు
జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేపై అన్ని మండలాల్లో కీలక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉండడంతో నెల రోజుల క్రితం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ప్రత్యేకంగా చర్చలు జరిపి బుజ్జగించినట్లు సమాచారం. మండలాల వారీగా ఆయా వర్గానికి చెందిన కీలక నాయకులను విడివిడిగా పిలిపించుకుని పొంగులేటి మాట్లాడినట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఎంపీ పొంగులేటి సదరు ఎమ్మెల్యే దంపతులను సైతం పిలిపించుకుని పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో పరిస్థితి చేయిదాటిపోతుందని హెచ్చరించడం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా వచ్చిన సర్వే నివేదికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఎమ్మెల్యేల విషయమై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top