లాభదాయక సాగుతోనే రైతు బాగు

CM KCR Review Meeting On Agriculture - Sakshi

ఆహార అవసరాలకు తగినట్టుగా పంటలు వేయాలి 

డిమాండ్‌ ఉన్న పంటల గురించి రైతులకు చెప్పాలి 

కొత్త గోదాముల్లో కోల్డ్‌ స్టోరేజ్‌ సదుపాయం ఉండాలి 

అన్నిటిపై అధ్యయనంచేసి మే 5లోగా నివేదిక ఇవ్వండి 

రెండోరోజూ వ్యవసాయంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలకు తగినట్టు, మార్కెట్లో డిమాండ్‌ కలిగిన పంటలను సాగు చేసేలా రైతులకు మార్గదర్శనం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వరి మాత్రమే కాకుండా ఇంకా ఏ పంటలు సాగు చేస్తే రైతులకు మేలు కలుగుతుందో అధ్యయనంచేసి మే 5లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించే గోదాముల్లో తప్పకుండా కోల్డ్‌ స్టోరేజీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో నూతన వ్యవసాయ విధానం రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరుసగా రెండో రోజు బుధవారం కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ‘తెలంగాణలో గతంలో ప్రాజెక్టులు, కరెంటు సరిగా లేకపోవడం వల్ల సాగునీటి లభ్యత అంతగా లేదు.

ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో రైతులు ఎవరికి తోచినట్టు వారు తమకున్న వనరులకు అనుగుణంగా పంటలు సాగు చేశారు. అందరూ ఒకే పంట వేయడం వల్ల ధరలు కూడా రాలేదు. ఇప్పుడు  పరిస్థితి మారుతోంది. ప్రతి మూలకూ సాగునీరు అందుతోంది. 24 గంటల కరెంటు వల్ల బోర్ల ద్వారా కూడా జోరుగా వ్యవసాయం సాగుతోంది. కాబట్టి రైతులను సరిగ్గా నిరేశించగలిగితే లాభదాయక వ్యవసాయం చేస్తారు.  ఈ దిశగా రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి అభిలషించారు. 

సన్నరకాల సాగుకు ప్రోత్సహించండి 
‘రాష్ట్రంలో ఎక్కువగా వరి పండిస్తున్నారు. పంటకాలం తక్కువనే కారణంతో దొడ్డు రకాలు పండిస్తున్నారు. ఎక్కువ మంది సన్నరకాలు తింటున్నారు. సన్నరకాలకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో డిమాండ్‌ ఉంది. ఇప్పుడు సాగునీటి వసతి కూడా ఉంది కాబట్టి రైతులు ఎక్కువగా సన్నరకాలు పండించేలా చైతన్య పరచాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు సాగు చేయాలి. అలా అయితేనే అన్ని పంటలకు డిమాండ్‌ వస్తుంది. తక్కువ శ్రమ, ఎక్కువ దిగుబడి, మార్కెట్‌ అవకాశాలు, మంచి ఆదాయం పొందగలిగే పంటలను గుర్తించాలి. వాటిని రైతులకు సూచించాలి. ఏ రైతు ఏ పంట వేయాలో నిర్ణయించి, సాగు చేయించాలి. వేరుశనగ, కందులు, పామాయిల్‌లాంటి వాటికి మార్కెట్లో డిమాండ్‌ ఉంది. ఇంకా ఇలాంటి డిమాండ్‌ కలిగిన పంటలను గుర్తించాలి. వాటిని ఎన్ని ఎకరాల్లో పండించాలి? అనే విషయం తేల్చాలి.

రాష్ట్రంలో కూరగాయలు, పండ్లకు కొరత ఉంది. అవి ఏ మోతాదులో పండించాలనే దానిపై కూడా అధ్యయనం జరగాలి. నీటి వసతి పెరిగినందున ఫిష్‌ కల్చర్‌ను కూడా తెలంగాణలో విస్తరించవచ్చా? అనే విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎరువుల వాడకం ఇప్పటిలాగానే ఉండాలా? మార్పులు అవసరమా? అనేది కూడా పరిశీలించాలి. పూర్తి స్థాయి అధ్యయనంచేసి మే 5లోగా నివేదిక ఇవ్వాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మరో 40లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించాలని నిర్ణయించినందున వెంటనే స్థలాలను గుర్తించాలని, కొత్తగా నిర్మించే గోదాముల్లో కోల్డ్‌ స్టోరేజ్‌ సదుపాయం కల్పించాలని సీఎం సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top