విచారణకు సీఐ డుమ్మా

Circle Inspector Absent in Car Robbery Case Enquiry Karimnagar - Sakshi

పోలీసుల ఎదుట హాజరుకాని ఇన్‌స్పెక్టర్‌

కరీంనగర్‌ సీఐపై కారు చోరీ ఆరోపణలు

‘41 ఎ’ నోటీసులు జారీ చేసిన అధికారులు

చార్జ్‌షీట్‌ దాఖలుకు పోలీసుల సన్నాహాలు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హబ్సిగూడలో నివసించే వివాహిత కారును చోరీ చేసి, ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్‌ కమిషనరేట్‌కు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ దేవరెడ్డి పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన కోరిన గడువు ప్రకారం సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పోలీసుస్టేషన్‌కు వచ్చి దర్యాప్తు అధికారికి వివరణ ఇవ్వాల్సి ఉంది. దేవరెడ్డి రాకపోవడంతో ఆయనపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. 

ఏం జరిగిందంటే..  
హబ్సిగూడలోని గ్రీన్‌హిల్స్‌ కాలనీలో నివసించే రాగిడి లక్ష్మారెడ్డి భార్య రాగిడి రజనీకి చెందిన 2013లో చోరీకి గురైంది. దీనిపై ఆమె అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తన వాహనం ఆచూకీ కనిపెట్టడానికి భర్తతో కలిసి ప్రయత్నాలు ప్రారంభించిన ఆమె అనేక కీలకాంశాలు గుర్తించారు. 2015 ఏప్రిల్‌ 4న దేవరెడ్డి సదరు వాహనానికి ఫ్రూచర్‌ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా ఏడాది కాలానికి బీమా తీసుకున్నారని, ఆ సందర్భంలో యజమాని పేరు, వివరాలను  ‘రజనీ.ఆర్‌  కేరాఫ్‌ దేవరెడ్డి’గా పేర్కొన్నారని తెలుసుకున్నారు. దేవరెడ్డి అధీనంలో ఉన్న ఆ కారు ప్రమాదానికి గురికాగా.. 2018 జనవరిలో ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి క్లెయిమ్‌ కూడా పొందారు. ఆ సమయంలో రజనీ సంతకాలను దేవరెడ్డి ఫోర్జరీ చేశారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో గత ఏడాది అన్ని ఆధారాలనూ జోడిస్తూ రజనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్‌ దాఖలు చేశారు. 

కేసు దర్యాప్తునకు  కోర్టు ఆదేశాలు..
దీన్ని విచారించిన కోర్టు కారు వ్యవహారానికి సంబంధించి ఇన్‌స్పెక్టర్‌ దేవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు గత ఏడాది మార్చి 25న ఓయూ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఇందులో దేవరెడ్డిని నిందితుడిగా పేర్కొంటూ చోరీ, ఫోర్జరీ, చీటింగ్‌ ఆరోపణలు చేర్చారు. దర్యాప్తులో భాగంగా ఓయూ పోలీసులు ఫ్రూచర్‌ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి 2018 జనవరిలో క్లెయిమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, పత్రాలు సంపాదించారు. ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్‌ దేవరెడ్డి తన డ్రైవింగ్‌ లైసెన్సును దాఖలు చేశారని, క్లెమ్‌ ఫామ్స్‌పై రజనీ మాదిరిగా సంతకం ఉన్నట్లు గుర్తించారు. దీంతో రజని నుంచి సంతకాల నమూనాలు తీసుకున్న పోలీసులు వాటితో పాటు క్లయిమ్‌ ఫామ్‌ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి పంపారు. ఈ రెండింటినీ విశ్లేషించిన ఫోరెన్సిక్‌ నిపుణులు ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ ఫారంపై సంతకం చేసింది రజనీ కాదని తేల్చారు. 

నిందితుడిగా నిర్ధారణ..
ఇటీవల ఈ నివేదిక అందుకున్న ఓయూ పోలీసులు దాని ఆధారంగా దేవరెడ్డిని నిందితుడిగా ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో గత సోమవారం (మే 18) లోపు తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు (సీఆర్పీసీ 41ఎ) జారీ చేశారు. గత సోమవారం ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) పోలీసుల ఎదుట హాజరైన దేవరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వడానికి వారం రోజుల గడువు కోరుతూ లేఖ అందించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేసు దర్యాప్తు అధికారి ఆ మేరకు గడువు ఇవ్వడంతో దేవరెడ్డి తిరిగి వెళ్లారు. దీని ప్రకారం సోమవారం హాజరుకావాల్సి ఉండగా ఆయన రాలేదు. దీంతో ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ నివేదిక ఆధారంగా దేవరెడ్డిపై అభియోగపత్రాలు దాఖలు చేయాలని ఓయూ పోలీసులు యోచిస్తున్నారు. నగరంలోని మెట్టుగూడలో ఉన్న ఆలుగడ్డ బావి ప్రాంతానికి చెందిన దేవరెడ్డి ప్రస్తుతం కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌లో సీఐగా పని చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top