ఇంటి దొంగలు తేలాకే కొత్త ఇళ్లు.. | CID enquiry on government houses, says kcr | Sakshi
Sakshi News home page

ఇంటి దొంగలు తేలాకే కొత్త ఇళ్లు..

Sep 11 2014 1:45 AM | Updated on Aug 14 2018 2:50 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారెవరో సీఐడీ విచారణలో తేలాల్సి ఉందని, వారిపై చర్యలు తీసుకున్న తర్వాతే కొత్త ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

* పేదలకు ఇళ్ల నిర్మాణంపై కేసీఆర్ స్పష్టత
* కొత్త చట్టాలతో కొత్త పాలనకు శ్రీకారం చుట్టాం
* రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ పాపమే
* నర్సాపూర్ సభలో కేసీఆర్
 
సాక్షి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారెవరో సీఐడీ విచారణలో తేలాల్సి ఉందని, వారిపై చర్యలు తీసుకున్న తర్వాతే కొత్త ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల పథకాన్ని హడావుడిగా చేపట్టి ఆ నిధులను కూడా దొంగలపాలు చేయబోమన్నారు. త్వరలోనే గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని, సిద్దిపేట తరహాలో తాగునీటి విధానాన్ని రాష్ట్రమంతటికీ విస్తరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. దాదాపు రాష్ర్ర్ట కేబినెట్ మొత్తం వేదికపై ఉండగా ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది.

‘ఇంతకుముందు ఇళ్ల పేరు మీద పైసలు మింగిన్రు. ఇయ్యాల మనం కట్టే ఇళ్లు ఎలక్షన్లప్పటి లెక్క ప్రకారం రూ. 3 లక్షలు అయితవనుకున్నం. ఇప్పుడు సిమెంటు ధర, సీకు ధర పెరిగింది. రూ. 3.30 లక్షలు అయితయని ఇంజనీర్లు చెప్తున్నరు. మనం పేదలకు కట్టే ఇళ్లు పక్కా పేదలకే చెందాలె. ఎవడన్నా దొంగ పదిండ్లను దక్కించుకుంటే మనకు రూ. 30 లక్షలు పోతయి. అదే వందిళ్లయితే రూ. 3.30 కోట్లు నష్టమైతది. ఈ దొంగలంతా కాసుకొని కూసున్నరు. పాత పద్ధతిలోనే వస్తయేమో... మింగుదామని చూస్తున్నరు.

హడావుడిగా ఇళ్ల పథకం పెడితే మళ్ల పాత పద్ధతిలోనే మింగేయడానికి తయ్యారుగున్నరు. టీఆర్‌ఎస్ దొంగ దందా చేయదు, ఎవడెవడు దొంగతనం జేసిన్రో దొరకబట్టాలని సీఐడీని ఆదేశించాను. విచారణలో బయట పడితేనే.. కొత్తగా కట్టే వాటిని నిఖార్సుగా కడతరు. దొంగల భరతం పట్టాలె, వాళ్లపై చర్యలు తీసుకోవాలె. అప్పుడే ఇండ్ల పథకం మొదలు పెడతం. నేను హైదరాబాద్‌లో పైసలేస్తే నేరుగా పేదల ఇంటికే పోవాలే. ప్రజలు కేంద్ర బిందువుగా నిర్ణయాలు ఉంటాయి తప్ప..  ఆగమాగమైపోయి తీసుకోను’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోణంలో పాత చట్టాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరముందని, దసరా  నుంచి రాష్ర్టంలో అసలు పని మొదలవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.  

నూటికి నూరుపాళ్లు రుణ మాఫీ చేస్తాం
రుణ మాఫీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇచ్చిన మాట మేరకు కచ్చితంగా దాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘నేను గూడా రైతు బిడ్డనే. నేనూ ఎవుసం చేస్తున్నా. రైతుల బాధేందో నాకు తెల్సు. భారమైనా సరే కచ్చితంగా రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయం జేసినం. ఆరు నూరైనా సరే బంగారంతో సహా అన్ని రకాల రుణాలను లక్ష రూపాయల వరకు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దాన్ని అమలుజేసి తీరుతాం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం వద్దు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు మనవిజేస్తున్నా. ఇంకో మాట.. నన్ను చంపినా అబద్ధం జెప్ప.

రుణమాఫీలోనూ ఇబ్బందులున్నయి. మనం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నం. అవి మాఫీ కావాలి. మూడు నాలుగు కిస్తీల్లో ఆ రుణం చెల్లిస్తామని బ్యాంకులతో మాట ముచ్చట తీసుకొని రుణ మాఫీ చేస్తం. అయితే ఆ బ్యాంకులకు రిజర్వు బ్యాంకోడు అనుమతి ఇయ్యాలె. వాడేమో ఇస్తలేడు. ఇయ్యనప్పుడు కూడా మనకు వేరే మార్గాలున్నాయి. ఒకటికి రెండుసార్లు మన అధికారులను రిజర్వ్‌బ్యాంకు దగ్గరికి పంపినం. వాళ్లు మూడు జిల్లాలకు పర్మిషన్లు ఇచ్చిన్రు. మిగతా జిల్లాలకు ఇంకా ఇయ్యలే. అనుమతి వచ్చిన జిల్లాల్లో వెంటనే మాఫీ చేసుకుంట ముందుకుపోతాం.

కొద్ది రోజుల్లోనే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాం. కాంగ్రెసోళ్ల పిచ్చి మాటలేవి పట్టుకోవద్దు. చేస్తే దీన్ని టీఆర్‌ఎస్ పార్టీ చేయ్యాలే తప్ప, పొన్నాల లస్మయ్య కాళ్లు మీదికి, తలకాయ కిందికి పెట్టినా అది సాధ్యం కాదు. 146 మంది రైతులు ఆత్మహత్య చేసున్నరని పొన్నాల అంటుండు. ఇది ఎవరి పాపం? 46 ఏళ్లు పాలించిన కాంగ్రెసోళ్ల పాపం కాదా? మీ పాపం ఈ వంద రోజుల్లోనే పోద్దా.. మీరుజేసిన ఆగం సిన్నదా?’’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడూ బీజేపీకి ఓటేయడని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement