కరుణామయుని కోవెలలో..

Christmas Celebration in Medak Church - Sakshi

సాక్షి, మెదక్‌: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ సీఎస్‌ఐ చర్చికి భారీ ఎత్తున భక్త జనం తరలివచ్చారు. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే రహదారులు బుధవారం వాహనాలు, భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే భక్తు ల రాక ప్రారంభమైంది. ఉదయం 4.30 గంటలకు జరిగిన మొదటి ఆరాధనలో సీఎస్‌ఐ చర్చి బిషప్‌ సాల్మన్‌రాజ్‌ దైవసందేశం ఇచ్చారు. చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకలకు క్రైస్తవులతోపాటు హిందువులు, ముస్లింలు కూడా రాగా.. మతసామరస్యం వెల్లివిరిసింది. కాగా, క్రిస్మస్‌ సందర్భంగా చర్చి ప్రాంగణం జాతరను తలపించింది. పోలీసులు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అధికారులతోసహా మొత్తం 450 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. అయితే.. పట్టణంలో కేటాయించిన మూడు పార్కింగ్‌ స్థలాలు కిక్కిరిసి పోగా.. రహదారుల వెంటే వాహనాలను పార్కింగ్‌ చేయడంతో పలుచోట్ల ట్రాఫిక్‌ సమస్య నెలకొంది.   

దేవుడి ఆశీస్సులతో అభివృద్ధి: హరీశ్‌రావు
ఏసయ్య జీవితాంతం ప్రజల కోసమే బతికారని మం త్రి హరీశ్‌రావు అన్నారు. దయ, కరుణ, ప్రేమ గుణాల ను ప్రతీ మనిషి కలిగి ఉండాలన్నారు. సీఎం కేసీఆర్‌  దేవుడి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అంతకు ముందు మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేసి సంబరాల్లో పాల్గొన్నారు.

సీఎస్‌ఐ చర్చి ముందు భక్తుల రద్దీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top