గవర్నర్.. సాగర్‌జీ | Sakshi
Sakshi News home page

గవర్నర్.. సాగర్‌జీ

Published Wed, Aug 27 2014 1:40 AM

గవర్నర్.. సాగర్‌జీ - Sakshi

జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లావాసిని తొలిసారి గవర్నర్‌గిరీ వరించింది. బీజేపీ సీనియర్ నేత సీహెచ్. విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితు లయ్యారు. సాగర్‌జీకి ఉన్నత పదవితో జిల్లావ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. విద్యార్థి నాయకుడిగా ప్రారంభ మైన ఆయన ప్రస్థానంలో ఎన్నో విజయాలున్నాయి. శాసనసభాపక్ష నేతగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగానూ సేవలందించారు. ఇటీవల కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంతో అనూహ్యంగా సాగర్‌జీని గవర్నర్‌గా నియమించింది.
 
విద్యార్థి నేత నుంచి...
విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ నాయకుడిగా విద్యాసాగర్‌రావు గుర్తింపు పొందారు. 1972లో ‘లా’ చదువుతుండగా.. ఏబీవీపీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ‘మీస’ చట్టం కింద అరెస్టై ఏడాదిపాటు జైలు జీవితం తర్వాత జనసంఘ్‌లో రాష్ట్ర, జాతీయస్థాయి రాజకీయల్లో క్రియాశీలక పా త్ర పోషించారు. మెట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి (1985, 1989, 1994) ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు.
 
మూడుసార్లు బీజేపీ శాసనసభాపక్షనేతగా పనిచేశారు. జాతీ య నాయకత్వం ఆదేశాలతో 1998లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 1999లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా మళ్లీ ఎన్నికయ్యారు. అప్పుడే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. కొన్నాళ్లు వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయమంత్రిగానూ పనిచేశారు.
 
బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏడు ఎంపీ, 12 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించడంలో ప్రధాన భూమిక పోషించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ నుంచి పోటీచేసిన విద్యాసాగర్‌రావు తన మేనల్లుడు, టీఆర్‌ఎస్ అభ్యర్థి బి.వినోద్‌కుమార్ చేతిలో ఓటమి పాలయ్యా రు. ప్రధాని మోడీతో సాగర్‌జీకి సన్నిహిత సం బంధాలున్నాయి. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పటేల్ విగ్రహ నిర్మాణం కోసం ఇనుము, ఇతర సామగ్రి సేకరణకు ఏర్పాటు చేసిన ఏక్‌తా ట్రస్ట్‌కు తెలంగాణలో విద్యాసాగర్‌రావే ఇన్‌చార్జిగా వ్యవహరించారు. కేంద్రం లో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అనూహ్యంగా సాగర్‌జీని గవర్నర్‌గిరీ వరించింది. ఇప్పటివరకు పీవీ.నర్సింహరావు మాత్రమే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసి జిల్లా కీర్తిని జాతీయస్థాయిలో చాటారు.  
 
జాతీయస్థాయిలో..
విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావడంతో జిల్లాకు తొలిసారి అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటివరకు ఒక్క పీవీ.నర్సింహరావు మాత్రమే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసి జిల్లా కీర్తిని జాతీయస్థాయిలో చాటి చెప్పారు.
 
ఎమ్మెస్సార్, కాకా కన్న ముందే..
కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు ఎం. సత్యనారాయణరావు(ఎమ్మెస్సార్) గవర్నర్ పదవి కోసం, జి. వెంకటస్వామి(కాకా)రాష్ట్రపతి పదవి కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. కానీ వారి కల నెరవేరలేదు. వీరికి జాతీయస్థాయిలో పలుకుబడి ఉండటమే కాకుండా ఏఐసీసీలో అత్యున్నత పదవులు అనుభ వించి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలతో నేరుగా పరిచయాలు ఉన్నా.. వీరి ఆకాంక్ష నెరవేరలేదు. పలు సందర్భాల్లో కాకా, ఎమ్మెస్సార్‌లు ఆయా పదవులపై తమ మక్కువను బాహాటంగానే ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంతో వీరి కల నెరవేరకుండా పోయింది. జిల్లా నుంచి తొలిసారి గవర్నర్‌గా ఎన్నికైన సాగర్‌జీ.. పై ఇద్దరు నాయకుల తర్వాతే రాజకీయాల్లోకి రావడం గమనార్హం.
 
బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం
కరీంనగర్ అర్బన్ :  విద్యాసాగర్‌రావుకు మహారాష్ట్ర గవర్నర్ పీఠం దక్కడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మెట్‌పల్లి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, కరీంనగర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగారు. 1999లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏడు ఎంపీ, 12 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకున్నారు. 2003లో వరంగల్ జిల్లా పరకాలలో అమరదామాన్ని నిర్మించారు.
 
గోదావరి నది జలాలు వృథాగా పోతుండడంతో ఆవేదన కు గురైన ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇటీవల నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  పటేల్ విగ్రహ ం ఏర్పాటుకు ఏక్‌తా ట్రస్టు ఆధ్వర్యంలో విద్యాసాగర్‌రావు ప్రత్యేక దృష్టి సారించి గ్రామగ్రామాన ఇనుము, మట్టి సేకరించారు.
 
గౌరవం దక్కించుకున్న సాగర్‌జీ
ఇటీవల కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీచేసిన విద్యాసాగర్‌రావు ఓడిపోయారు.  కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం.. అప్పటికే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తారన్న నమ్మకమున్న విద్యాసాగర్‌రావుకు గవర్నర్ గిరీ దక్కడం ద్వారా ఆయన తెలంగాణ ప్రాంతం నుంచే తొలిసారి అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్న వ్యక్తిగా చరిత్రకెక్కారు.
 
అంబరాన్నంటిన సంబరాలు..
విద్యాసాగర్‌రావుకు గవర్నర్ పీఠం దక్కడంతో జిల్లాలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. జిల్లావ్యాప్తంగా స్వీట్లు పంచిపెట్టారు. టపాసులు కాల్చారు.

Advertisement
 
Advertisement