ఆస్పత్రుల్లో నిఘా నేత్రం! | CC cameras in Osmania General Hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల్లో నిఘా నేత్రం!

Jul 16 2015 1:50 AM | Updated on Oct 9 2018 7:11 PM

ఆస్పత్రుల్లో నిఘా నేత్రం! - Sakshi

ఆస్పత్రుల్లో నిఘా నేత్రం!

వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రుల ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది.

సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రుల ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు వైద్య సేవలు అందకపోవడం, అనేకచోట్ల అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతోన్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని సర్కారు యోచిస్తోంది. ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) మొదలుకొని.. ఉస్మానియా ఆస్పత్రి వరకు అన్ని ఆస్పత్రుల్లో విడతలవారీగా సీసీ కెమెరాలు నెలకొల్పాలని భావిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ప్రధాన కార్యాలయాల్లోనూ వీటి ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా స్వయంగా తన చాంబర్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు.
 
అత్యాధునిక కెమెరాల కొనుగోలు..
360 డిగ్రీల కోణంలో చిత్రీకరించే, ఐపీ అడ్రస్ కలిగిన అత్యంత అధునాతన సీసీ కెమెరాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఆయా కార్యాలయాల్లో జరిగే అన్ని వ్యవహారాలను ఇంటర్నెట్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఆయా కార్యాలయాల నుంచి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చాంబర్లకు అనుసంధానం చేసి పర్యవేక్షించాలని యోచిస్తోంది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా విమర్శలు రావడంతో పకడ్బందీగా వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది.

ఇందులో భాగంగా వరంగల్ ఎంజీఎంలో ప్రయోగాత్మకంగా 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. త్వరలో వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
 

వెద్య సేవలు.. పారిశుద్ధ్యం పర్యవేక్షణకే..
వైద్యులు సకాలంలో రావడంలేదని.. వచ్చినా రోగులకు సేవలు అందడం లేదని.. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలపై విమర్శలున్నాయి. కిందిస్థాయి ఉద్యోగి నుంచి పెద్దస్థాయి అధికారి వరకు కొందరిపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దీన్ని నివారించేందుకే సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ యోచన.

ఈ సీసీ కెమెరాలన్నీ ఇంటర్నెట్ ప్రొటోకాల్(ఐపీ) అడ్రస్ కలిగి ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉంటాయి. వీటిని సెల్‌ఫోన్.. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే.. వాటి ఐపీ అడ్రస్‌ను నమోదు చేయడం ద్వారా ఏ ఆస్పత్రినైనా సచివాలయంలోని నిర్ణీత చాంబర్ల నుంచి నేరుగా పర్యవేక్షించవచ్చు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో మొబైల్‌లో నుంచి కూడా పర్యవేక్షించవచ్చు. దీనివల్ల సిబ్బంది క్రమశిక్షణతో వైద్య సేవలు అందిస్తారన్నది సర్కారు ఆలోచన. సీసీ కెమెరాలపై నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్‌రూం లాంటిది ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement