పోలవరం ముంపు గ్రామాల ప్రకటనతో మండలంలోని గన్నవరం గ్రామ ప్రజల్లో అయోమయం నెలకొంది.
భద్రాచలం రూరల్, న్యూస్‌లైన్: పోలవరం ముంపు గ్రామాల ప్రకటనతో మండలంలోని గన్నవరం గ్రామ ప్రజల్లో అయోమయం నెలకొంది. తమ గ్రామం ముంపు పరిధిలోకి వస్తుందా.. లేక తెలంగాణలోనే ఉంటుందా అనేది వారికి అంతుపట్టడం లేదు. ప్రాజెక్ట్ నిర్మాణంతో భద్రాచలం మండలంలో 13 గ్రామాలే ముంపునకు గురవుతాయని ప్రకటించారు. ఇందులో రాచగొంపల్లి గ్రామం ఒకటి. అయితే ఈ గ్రామం ప్రస్తుతం గన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. సుమారు 28 కుటుంబాలు నివసించే ఈ గ్రామం 1986 వరకు గోదావరి నది ఒడ్డునే ఉండేది. 1986లో గోదావరికి వచ్చిన భారీ వరదలతో గ్రామం పాడవటంతో అక్కడి కుటుంబాల వారు ప్రదాన రహదారికి ఇవతల ఉన్న గన్నవరం గ్రామానికి వచ్చారు.
రాచగొంపల్లి పరిధిలో గన్నవరం, కాపుగొంపల్లి గ్రామాలకు చెందిన రైతుల భూములే ఎక్కువగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో 262 ఎకరాల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతాయని సర్వేలో తేల్చారు. వీటిలో 212.85 ఎకరాలకు చెందిన రైతులకు నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చేసింది. అయితే రాచగొంపల్లి గ్రామంలోని ఇళ్లను మాత్రం సర్వే చేయలేదు. కాగా ఈ కుటుంబాలన్నీ గన్నవరం గ్రామంలో మిళితమై ఉండటంతో ఇప్పడు సర్వే చేయాలంటే పలు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే వ్యవసాయ భూములను ముంపుగా గుర్తించిన అధికారులు.. తమ గ్రామం ముంపులో లేదని ప్రకటించటంతో గన్నవరంలోని 225 కుటుంబాలు, కాపుగొంపల్లికి చెందిన 99 కుటుంబాల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాగు భూములు కోల్పోయిన తాము ఇప్పుడెలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద 48 అడుగులకు చేరుకోగానే ప్రధాన రహదారిపై ఉన్న కాపుగొంపల్లి పరిధిలోని 28 కుటుంబాల జాలర్ల ఇళ్లు ముంపునకు గురవుతాయి. కానీ ఈ గ్రామం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ముంపునకు గురవదని చెపుతుండటంతో వారు అయోమయంలో పడ్డారు. సర్వేల్లో స్పష్టత లేదని, అసలు ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించకుండా ప్రభుత్వం తప్పడు సర్వే నివేదికలు చూపుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 2 సమీపిస్తుండటంతో తమ గ్రామాన్ని ఆంధ్రలో కలుపుతారో...తెలంగాణాలోనే ఉంచుతారో తెలియక అయోమయంలో ఉన్నారు.