
ఏసీబీ వలలో హౌసింగ్ అధికారులు
ఓ ఉద్యోగి కొనుగోలు చేసిన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు హౌసింగ్ బోర్డు అధికారులతోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.
లంచం తీసుకున్న నలుగురి పట్టివేత
సంగారెడ్డి : ఓ ఉద్యోగి కొనుగోలు చేసిన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు హౌసింగ్ బోర్డు అధికారులతోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లా ఏసీబీ డీఎస్పీ షేక్ నవాబ్ జాన్ కథ నం మేరకు వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డికి చెందిన ఆర్టీసీ డిపో సూపర్‌వైజ రూచిని సురేందర్ 2001లో సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి ఫేజ్-1లో ఎంఐజీ-48 ఇంటిని రూ. లక్షా 40 వేలకు నర్సింహరెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ ఇంటిపై ఉన్న బకాయి డబ్బులను దశల వారీగా చెల్లించాడు. ఇటీవలే చెల్లింపు పూర్తయింది. దీంతో ఇంటిని తన పేర రిజిస్ట్రేషన్ చేయించడానికి కూకట్‌పల్లిలోని హౌసింగ్ బోర్డు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
ఇందుకోసం కూకట్‌పల్లిలోని ఈఈ, హౌసింగ్‌బోర్డు వెస్ట్ డివిజన్ కార్యాలయంలోని అసిస్టెంట్ ఎస్టేట్ అధికారి ఆర్.జగదీశ్వర్‌రావు, కార్యాలయ సూపరింటెండెంట్ బి.కె.నాగశేషుడు రూ. 12 వేలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వనిదే రిజిస్ట్రేషన్ చేయబోమన్నారు. దీంతో బాధితుడు సంగారెడ్డిలో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాస్, వాచ్‌మెన్ బి.రాందాస్‌లకు బాధితుడు సురేందర్ రూ. 12 వేలను అందజేశారు.
దీంతొ వెంటనే జిల్లా ఏసీబీ డీఎస్పీ షేక్ నవాబ్‌జాన్, ఇన్‌స్పెక్టర్లు ప్రతాప్‌కుమార్, నవీన్‌కుమార్, సిబ్బంది శుక్రవారం రాత్రి కూకట్‌పల్లిలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంపై మెరుపు దాడులు జరిపి అధికారులను పట్టుకున్నారు. నిందితులు అసిస్టెంట్ ఎస్టేట్ అధికారి ఆర్.జగదీశ్వర్‌రావు, కార్యాలయ సూపరింటెండెంట్ బి.కె.నాగశేషుడు, జూనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాస్, వాచ్‌మెన్ బి.రాందాస్‌లను అరెస్ట్ చేశారు. శనివారం వారిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు.