breaking news
Housing Board officials
-
వారికి పెన్షన్ వచ్చే జన్మలో ఇస్తారా: హైకోర్టు
2020, ఫిబ్రవరిలో వీరికి అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని ఆదేశించినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. దాదాపు 19 మంది పిటిషనర్లు ఇప్పటికే చనిపోయారు. ఏడాది గడిచినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి వైఖరి కోర్టు ధిక్కరణే. ఆ మేరకు ఆ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సిందే.– హైకోర్టు సాక్షి, హైదరాబాద్: పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడంలోనూ ప్రాంతీయ వివక్ష చూపిస్తారా.. అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏపీ స్థానికత కలిగిన హౌసింగ్ బోర్డు ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీసింది. పిటిషనర్లందరూ సీనియర్ సిటిజన్స్ అని, వారి జీవిత కాలంలో కాకుండా వచ్చే జన్మలో పెన్షన్ ఇస్తారా అని ప్రశ్నించింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు దగ్గర పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ ఉందని, నాలుగు వారాల్లోగా పెన్షన్ బెనిఫిట్స్‌తోపాటు అరియర్స్ అన్నీ ఇవ్వాలని, లేకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 26కు వాయిదా వేసింది. తమకు పెన్షన్ బెనిఫిట్స్ ఇప్పించేలా ఆదేశించాలంటూ తెలంగాణ హౌసింగ్ బోర్డు రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి చెందిన 227 మందితోపాటు, ఆర్.సుమతి మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి వారికి పెన్షన్ సహా ఇతర బెనిఫిట్స్‌ను రెండు నెలల్లోగా ఇవ్వాలని తెలంగాణ హౌసింగ్ బోర్డును ఆదేశిస్తూ 2020 ఫిబ్రవరిలో తీర్పునిచ్చారు. దాదాపు ఏడాది గడిచినా ఈ తీర్పును అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద వీరు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మళ్లీ విచారించింది. మరీ ఇంత వివక్షా?... ‘ఈ దేశంలో అందరూ సమానమే. ఏపీ స్థానికత కలిగిన వారిని తెలంగాణ ప్రభుత్వం వివక్షతాపూ రితంగా చూస్తోంది. పిటిషనర్లకు 2013, 2015, 2018 పెన్షన్ బెనిఫిట్స్‌ను వర్తింపజేయలేదు. హౌసింగ్ బోర్డు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం నుంచి అప్పు తీసుకొని అయినా ఇవ్వొచ్చు. లేదా హౌసింగ్ బోర్డు ఆస్తులను కుదవపెట్టి అయినా ఉద్యోగులకు ఇవ్వాల్సిన పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధి కారుల వైఖరి కోర్టు ధిక్కరణే. ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిందే’ అని ధర్మాసనం అభిప్రాయ పడింది. పిటిషనర్లకు అన్ని బెనిఫిట్స్ ఇచ్చేందుకు ఆరు నెలల సమయం ఇవ్వాలని, ఈలోగా కోర్టు తీర్పును అమలు చేస్తామని ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ నివేదించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మూడు నెలలు లేదా రెండు నెలలు, కనీసం నాలుగు వారాల సమయం ఇస్తే తీర్పును అమలు చేస్తామని అభ్యర్థించారు. దీనికి అనుమతించిన ధర్మాసనం... ఈ కేసులో తీర్పును రిజర్వు చేస్తున్నామని, నాలుగు వారాల్లోగా అన్ని బెనిఫిట్స్, అరియర్స్‌తో సహా ఇవ్వకపోతే సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జూలై 26కు వాయిదా వేసింది. చదవండి: లాకప్‌డెత్ కేసు: అవసరమైతే రీపోస్ట్‌మార్టం చేయండి:హైకోర్టు -
ఏసీబీ వలలో హౌసింగ్ అధికారులు
లంచం తీసుకున్న నలుగురి పట్టివేత సంగారెడ్డి : ఓ ఉద్యోగి కొనుగోలు చేసిన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు హౌసింగ్ బోర్డు అధికారులతోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లా ఏసీబీ డీఎస్పీ షేక్ నవాబ్ జాన్ కథ నం మేరకు వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డికి చెందిన ఆర్టీసీ డిపో సూపర్వైజ రూచిని సురేందర్ 2001లో సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి ఫేజ్-1లో ఎంఐజీ-48 ఇంటిని రూ. లక్షా 40 వేలకు నర్సింహరెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ ఇంటిపై ఉన్న బకాయి డబ్బులను దశల వారీగా చెల్లించాడు. ఇటీవలే చెల్లింపు పూర్తయింది. దీంతో ఇంటిని తన పేర రిజిస్ట్రేషన్ చేయించడానికి కూకట్‌పల్లిలోని హౌసింగ్ బోర్డు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఇందుకోసం కూకట్‌పల్లిలోని ఈఈ, హౌసింగ్‌బోర్డు వెస్ట్ డివిజన్ కార్యాలయంలోని అసిస్టెంట్ ఎస్టేట్ అధికారి ఆర్.జగదీశ్వర్‌రావు, కార్యాలయ సూపరింటెండెంట్ బి.కె.నాగశేషుడు రూ. 12 వేలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వనిదే రిజిస్ట్రేషన్ చేయబోమన్నారు. దీంతో బాధితుడు సంగారెడ్డిలో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాస్, వాచ్మెన్ బి.రాందాస్‌లకు బాధితుడు సురేందర్ రూ. 12 వేలను అందజేశారు. దీంతొ వెంటనే జిల్లా ఏసీబీ డీఎస్పీ షేక్ నవాబ్‌జాన్, ఇన్స్పెక్టర్లు ప్రతాప్‌కుమార్, నవీన్‌కుమార్, సిబ్బంది శుక్రవారం రాత్రి కూకట్‌పల్లిలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంపై మెరుపు దాడులు జరిపి అధికారులను పట్టుకున్నారు. నిందితులు అసిస్టెంట్ ఎస్టేట్ అధికారి ఆర్.జగదీశ్వర్‌రావు, కార్యాలయ సూపరింటెండెంట్ బి.కె.నాగశేషుడు, జూనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాస్, వాచ్మెన్ బి.రాందాస్‌లను అరెస్ట్ చేశారు. శనివారం వారిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు.