దుర్గం చెరువుపై వేలాడే వంతెన

Cable Suspension Bridge At Durgam Cheruvu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుర్గం చెరువుపై రూ.184 కోట్లతో నిర్మిస్తున్న డబుల్‌ డోస్డ్‌ కేబుల్‌ బ్రిడ్జి పనుల్లో శనివారం అద్భుతం ఆవిష్కృతమైంది. ఇక్కడ 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తున్న సిమెంట్‌ కాంక్రీట్‌ సెగ్మెంట్ల అమరికకు అత్యాధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తున్న విషయం విదితమే. ఇప్పటి వరకు ఒక్కో సెగ్మెంట్‌ను మాత్రమే అమర్చగా... శనివారం ఏక కాలంలో రెండు సెగ్మెంట్లను ఒకేసారి పైకి తీసుకెళ్లి విజయవంతంగా అమర్చారు.

కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే ఈ పని పూర్తి చేసిన ఇంజినీరింగ్‌ టీమ్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.  బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేందుకు మొత్తం 53 సెగ్మెంట్లు అమర్చాల్సి ఉండగా... ఈ రెండింటితో కలిపి 50 సెగ్మెంట్ల అమరిక పూర్తయిందని ప్రాజెక్ట్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ వెంకటరమణ తెలిపారు. మిగిలిన మూడు సెగ్మెంట్ల అమరిక పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.      

కాగా అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సమీప ప్రాంతం నుంచి మాదాపూర్‌  ఇనార్బిట్‌మాల్‌  వరకు దాదాపు కి.మీ. పొడువున నిర్మించే ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్‌ నుంచి హైటెక్‌సిటీ, మాదాపూర్‌ రూట్లో వెళ్లే వారికి ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పుతాయి. అలాగే ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగానూ సందర్శకులను ఆకట్టుకోనుంది. హౌరా– కోల్‌కత్తాల నడుమ నున్న హౌరా బ్రిడ్జిని( రవీంద్ర సేతు) తలపించేలా  ఈ  వేలాడే వంతెనను  నిర్మించనున్నారు

ఆరు లేన్లతో తగిన ఫుట్‌పాత్‌లతో నిర్మిస్తున్న ఈబ్రిడ్జిపై ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారు. దీనికయ్యే వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఐఐసీ  చెరిసగం భరించనున్నాయి. ముంబై, గోవా, కోల్‌కత్తా,  జమ్మూకాశ్మీర్, జైపూర్‌ వంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఇలాంటి బ్రిడ్జిలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అందుబాటులో లేవు.

ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే..

♦   నగరంలోని ఇతర ప్రాంతాలనుంచి హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు వెళ్లే వారికి సదుపాయంగా ఉంటుంది.

♦   జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 36, మాదాపూర్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది.

♦   జూబ్లీహిల్స్‌ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలి వెళ్లేవారికి  దాదాపు 2 కి.మీ.ల మేర దూరం తగ్గుతుంది.

బ్రిడ్జి ముఖ్యాంశాలు..

♦   అప్రోచ్‌లతో సహ బ్రిడ్జి పొడవు:  1048 మీ.

♦    కేబుల్‌ స్టే బ్రిడ్జి (వేలాడే వంతెన): 366 మీ.

♦  అప్రోచ్‌ వయడక్ట్, ర్యాంప్‌: 682 మీ.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top