తుమ్మలకు ‘పవర్’! | Sakshi
Sakshi News home page

తుమ్మలకు ‘పవర్’!

Published Tue, Oct 7 2014 2:33 AM

తుమ్మలకు ‘పవర్’! - Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జిల్లా నుంచి కేబినెట్‌లో స్థానం ఎవరికి, ఎప్పుడు దక్కుతుంది? ఏ శాఖ కేటాయిస్తారనే ఉత్కంఠ త్వరలోనే వీడనుంది. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో స్థానం ఖరారైంది. ఈ మేరకు తనను కలిసిన జిల్లా పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది.

ఈనెల 11, 12 తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలు, బహిరంగసభ ఉన్నందున 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు మంత్రివర్గ విస్తరణ చేస్తానని, అందులో తుమ్మలకు స్థానం ఖాయమని ఆయన చెప్పినట్టు సమాచారం. తుమ్మలకు ఏ శాఖను కేటాయించాలన్నది కూడా దాదాపు కొలిక్కి వచ్చిందని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో తుమ్మల నిర్వహించిన విద్యుత్‌శాఖనే ఆయనకు కేటాయించనున్నారు. దీనితో పాటు ఆర్‌అండ్‌బీ లేదా పంచాయతీరాజ్ శాఖల్లో ఒక దానిని తుమ్మలకు కేటాయించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో కేసీఆర్, తుమ్మల ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడు కేసీఆర్ రవాణాశాఖ నిర్వహించగా, తుమ్మల ఇంధనశాఖతో పాటు ఆర్‌అండ్‌బీ శాఖలను నిర్వహించారు.

ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ పరిస్థితి, జిల్లాలో నెలకొల్పనున్న కొత్త విద్యుత్ ప్రాజెక్టులు తదితర అంశాలకు సంబంధించి అనుభవమున్న వ్యక్తిగా తుమ్మలకు ఇంధనశాఖ కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో వేదిక ముందు కూర్చున్న తుమ్మలను స్వయంగా కేసీఆరే వేదికపైకి ఆహ్వానించి కుర్చీ వేయించి మరీ కూర్చోబెట్టడం గమనార్హం.
 
తుమ్మల గారూ రండీ....

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర పార్టీ నేతలతో పాటు వేదిక ముందున్న సీట్లలో రెండో వరుసలో కూర్చున్నారు. సమావేశం ప్రారంభం కాగానే పార్టీ సెక్రటరీ జనరల్ కేకేతో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ సలహాదారులు రామచంద్రునాయక్, రమణాచారి తదితరులు వేదికపై కూర్చున్నారు. సీఎం కేసీఆర్ కూడా వేదికపై ఆసీనులైన తర్వాత తుమ్మలను చూసి.. వెంటనే వేదికపై మరో కుర్చీ వేయాలని సూచించారు. ‘తుమ్మల గారూ వేదిక పైకి రండి’ అని స్వయంగా ఆహ్వానించారు. తన ప్రసంగంలో భాగంగా తుమ్మలను పార్టీ నేతలకు పరిచయం చేశారు. పార్టీ పరంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమావేశంలో సీనియర్ పార్టీ నాయకులు, మంత్రులను వేదిక ముందు కూర్చోబెట్టి, ప్రత్యేకంగా తుమ్మలను వేదికపైకి ఆహ్వానించడం జిల్లాలో చర్చనీయాంశమవుతోంది.
 
‘పవర్’ ఆయన చేతికే

జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు తుమ్మలకే అప్పగిస్తున్నానని నాగేశ్వరరావు పార్టీలో చేరే రోజే బహిరంగంగా చెప్పిన కేసీఆర్ ఆ విషయంలో మరింత స్పష్టతనిస్తున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశాలకు జనసమీకరణ బాధ్యతలను అన్ని జిల్లాలకు చెందిన మంత్రులకు అప్పగిస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్.. మంత్రివర్గంలో స్థానం లేని జిల్లా బాధ్యతలను తుమ్మలకు ఇస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు తన నివాసంలో పార్టీ నేతలతో జరిగిన ఇష్టాగోష్టి సమావేశంలోనూ తుమ్మలకు ఆయన అత్యంత ప్రాధాన్యతనిచ్చి మాట్లాడినట్టు తెలుస్తోంది. కాగా, ప్లీనరీలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘ఒకప్పుడు చాలా బలహీనంగా ఉన్న ఖమ్మం జిల్లాలో పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం అయింది.

ఆదిలాబాద్ కన్నా ఇప్పుడు ఖమ్మంలో పార్టీ బలంగా ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏడు స్థానాల్లో విజయం సాధించడం ఖాయం. ఇప్పుడు ఖమ్మం జిల్లాను టీఆర్‌ఎస్ జిల్లా అని రాసుకోవచ్చు.’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మొదటి నుంచి (2001 నుంచి) పార్టీకి అండగా ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని, ఇందుకు కర్నె ప్రభాకర్ లాంటి వ్యక్తులకు లభించిన పదవులే నిదర్శనమని చెప్పిన కేసీఆర్.. ఎమ్మెల్యేలు లేని చోట్ల గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారే ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారని కూడా చెప్పినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4000 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని కూడా కేసీఆర్ చెప్పడంతో జిల్లా పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. కేసీఆర్ చెప్పిన దాన్ని బట్టి జిల్లాకు అన్ని స్థాయిల్లో కలిసి 400 వరకు నామినేటెడ్ పోస్టులు వస్తాయనే ఆశలో పార్టీ నేతలున్నారు.
 
ఏజెన్సీలో నాన్‌ట్రైబ్స్‌కు రుణమాఫీ ఎలా?

ఈ సమావేశం అనంతరం జిల్లా నుంచి ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు తుమ్మలతో కలిసి కేసీఆర్ నివాసానికి వెళ్లి కొంతసేపు ఇష్టాగోష్టి మాట్లాడారు. జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చ జరిగింది. రుణమాఫీకి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులకు రుణమాఫీ వర్తింపచేయడం సాధ్యం కావడం లేదని, దీనిని పరిష్కరించాలని కేసీఆర్‌ను జిల్లా నేతలు కోరడంతో ఆయన స్పందించి వెంటనే జిల్లా కలెక్టర్ ఇలంబరితిని ఫోన్‌లో సంప్రదించారు. ఈ సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరించాలని, అర్హులైన అందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని, బోగస్ రుణాలను చెల్లించవద్దని ఈ సందర్భంగా కలెక్టర్‌కు సీఎం చెప్పినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
 
Advertisement