స్టూడియో కెమెరాల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి మూడు కెమెరాలను స్వాధీనం చేసుకున్నట్లు తొగుట సీఐ వెంకటయ్య తెలిపారు.
కొండపాక :స్టూడియో కెమెరాల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి మూడు కెమెరాలను స్వాధీనం చేసుకున్నట్లు తొగుట సీఐ వెంకటయ్య తెలిపారు. మండలంలోని కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలను తెలిపారు. మండలంలోని సిరిసినగండ్ల గ్రామానికి చెందిన నర్రా యాదగిరి, వరంగల్ జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన షరీఫ్‌లు ఇద్దరు కలిసి కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని కృష్ణ ఫొటో స్టూడియోలో ఈ నెల 21న రెండు డిజిటల్ కెమెరాలు, ఒక వీడియో కెమెరాను దొంగిలించారు.
ఈ విషయమై స్టూడియో యజమాని పెరుగు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులిద్దరూ ఎత్తుకెళ్లిన కెమెరాలను విక్రయించడానికి తీసికెళ్తుండగా వెలికట్ట చౌరస్తాలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా వారి నుంచి మూడు కెమరాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.