ప్రాజెక్టుల నిర్వహణకు బడ్జెట్‌లో నిధులు

 Budget Funds For Project Management Says KCR - Sakshi

ఏటా బడ్జెట్‌లో ఓఅండ్‌ఎంకు నిధుల కేటాయింపు

పంపులు, మోటార్లు, గేట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కాల్వలు, పవర్‌లైన్ల లెక్కలు తీయాలని సీఎం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ఇకపై ప్రభుత్వమే చూడనుంది. ఎత్తిపోతల పథకాల ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ (ఓఅండ్‌ఎం)కు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది. ఈ ఎత్తిపోతల పథకాల ఓఅండ్‌ఎంకు ఇక ఏటా రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు సైతం కేటాయించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఎత్తిపోతల పథకాల పరిధిలో పంప్‌హౌస్‌ల్లోని మోటార్లు, పంపులు, విద్యుత్‌ సరఫరా చేసే జనరేటర్లు, డ్యామ్‌ల పరిధిలో గేట్లు, వాటి నిర్వహణ, కాల్వలు, టన్నెళ్లు ఇవన్నీ ఓఅండ్‌ఎం కిందకే వస్తాయి. ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టే ఏజెన్సీలు నిర్ణీత కాలం వరకే ఓఅండ్‌ఎం బాధ్యతలను చూస్తున్నాయి. ఆ తర్వాత ఈ బాధ్యతలను ప్రభుత్వమే చూడాలి.

అయితే ప్రభుత్వం వద్ద అంత సిబ్బంది లేక టెండర్ల ద్వారా మళ్లీ ప్రై వేటు ఎజెన్సీలకే ఆ బాధ్యతలను కట్టబెడుతోంది. కాగా వరద ఉండే 6 నెలల కాలానికే ఈ నిర్వహణ బాధ్యతలకై టెండర్లు పిలుస్తుండటంతో ప్రైవేటు ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు బడ్జెట్‌లో కేటాయించడం లేదు. అదీగాక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాల నిర్వహణ మున్ముందు కత్తిమీద సాము కానుంది. ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని మళ్లించాలంటే విద్యుత్, ఓఅండ్‌ఎంకే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రానుంది. 2020–21 నుంచి 2024–25 వరకు రానున్న ఐదేళ్ల కాలానికి విద్యుత్‌ అవసరాలకు, నిర్వహణ భారం కలిపి ఏకంగా రూ.40,170 కోట్లు ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది.

ఇందులో విద్యుత్‌ అవసరాల ఖర్చే రూ.37,796 కోట్లు ఉండగా, ఓఅండ్‌ఎంకు అయ్యే వ్యయం రూ.2,374 కోట్లు ఉండనుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల వారీగా ఉన్న పంపులు, మోటార్లు, గేట్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, కాల్వలు, టన్నెళ్లు, వాటి పొడవు, రిజర్వాయర్‌లు, వాటి పరిధిలోని లిఫ్టులు తదితర వివరాలన్నీ ముందుగా తేల్చి, వాటి నిర్వహణకు అవసరమైన వ్యూహాన్ని, మ్యాన్యువల్‌ను ఖరారు చేయాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల సాగునీటి శాఖపై జరిగిన సమీక్ష సందర్భంగా అధికారులను ఆదేశించారు. నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులంతా రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర స్థాయి వర్క్‌ షాపు నిర్వహించుకుని, తెలంగాణ సమగ్ర నీటి పారుదల విధానాన్ని రూపొందించాలని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top