‘చదువు గోల నా వల్ల కాదు’   

Boy  Missed From Hostel - Sakshi

లెటర్‌ రాసి హాస్టల్‌ నుంచి పరారైన విద్యార్థి

సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పట్టుకున్న పోలీసులు

నార్సింగి శ్రీచైతన్య కళాశాలలో ఘటన

రాజేంద్రనగర్‌ : కాలేజీలో బోధించే చదువు ఒంటపట్టడం లేదని, తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో చదవులో రాణించలేకపోతున్నా.. నా వల్ల కాదు నేను వెళ్లిపోతున్నానని ఓ విద్యార్థి కళాశాల డీన్‌కు రాసిన లేఖ నార్సింగి పోలీసులను హడలెత్తించింది. ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు చివరికి ఆ విద్యార్థిని క్షేమంగా తీసుకువచ్చారు. నార్సింగి సీఐ రమణాగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... షాద్‌నగర్‌కు చెందిన ఎస్‌.చాణిక్యవర్షిత్‌రెడ్డి (17) నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్‌లో ఉంటున్నాడు.

నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్లాడు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయి బాగా చదవాలని తల్లిదండ్రులు సూచించారు. ఇంటి నుంచి తిరిగి కళాశాలకు రాగా అధ్యాపకులు సైతం శ్రద్ధగా చదవాలంటూ తెలపడంతో ఒత్తిడికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో డీన్‌కు ఓ లెటర్‌ రాసి హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లాడు. తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో చదవ లేకపోతున్నా.. ఒత్తిడికి గురవుతున్నానని, కాలేజీలో బోధించిన చదువు ఒంటబట్టడం లేదంటూ హాస్టల్‌ డీన్‌ తల్లిలా చూసుకుంటుందంటూ లెటర్‌ రాశాడు.

ఉదయం వర్షిత్‌రెడ్డి కనిపించకపోవడాన్ని గమనించిన డీన్, అధ్యాపకులు రూమ్‌లో పరిశీలించగా లెటర్‌ లభ్యమైంది. వెంటనే తల్లిదండ్రులతో పాటు నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. హాస్టల్‌కు చేరుకున్న తల్లిదండ్రులు తెలిసిన వారితో పాటు బంధువుల ఇళ్లలో వాకబు చేయగా ఫలితం లభించలేదు. చివరకు పోలీసులు శుక్రవారం సాయంత్రం సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా వర్షిత్‌రెడ్డి ఆచూకీ తెలుసుకొని స్టేషన్‌కు తీసుకువచ్చారు. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో వర్షిత్‌రెడ్డికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top