మరోసారి ఆశీర్వదించండి : ఎంపీ  కవిత 

Bless Me Again  In Nizamabad Said MP Kavitha - Sakshi

నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా 

కోరుట్ల:  ‘‘టీఆర్‌ఎస్‌ మీ ఇంటి పార్టీ.. కోరుట్ల నాకు సెంటిమెంట్‌ ఊరు.. మరోసారి ఆశీర్వదించండి.. నిరంతరం అభివృద్ధికి పాటుపడతా’ అని నిజామాబాద్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట కవిత పేర్కొన్నారు. బుధవారం కోరుట్లలోని పీబీ గార్డెన్స్‌లో టీఆర్‌ఎస్‌లో మున్నూరు కాపు సంఘాల చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘాలతో పాటు బీడీ టేకేదార్లు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందన్నారు.

ఎంపీగా మొదటిసారి గెలిచిన తర్వాత మొట్టమొదటగా కోరుట్లలో ప్రజలు నీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించి రూ. 36 లక్షలు కేటాయించానన్నారు. ఎంపీగా గెలిచినప్పటినుంచి నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చకచకా సాగాయన్నారు. కోరుట్ల ప్రజల ఆకాంక్షల మేరకు రెవెన్యూ డివిజన్, వంద పడకల ఆసుపత్రి, 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి–నిజామాబాద్‌ రైల్వేలైన్‌ పూర్తి చేయించి కోరుట్లకు రైలు తెప్పించామన్నారు. తిరుపతి, ముంబయి రైళ్లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయన్నారు.

కోరుట్లలో ముంబయి రైలు ఆగేలా ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. కోరుట్ల మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం ఎన్నడూ లేని రీతిలో రూ. 50 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయిస్తున్నామన్నారు. మళ్లీ తనను గెలిపిస్తే రానున్న కాలంలో కోరుట్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జెడ్పీచైర్‌పర్సన్‌ తుల ఉమ, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ చీటి వెంకట్‌ రావు, మున్సిపల్‌ చైర్మన్‌ గడ్డమీది పవన్, పట్టణ, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

 పేదలు ఆత్మగౌరవంతో బతకాలి 
కోరుట్లరూరల్‌: రాష్ట్రంలో పేదప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని ఎంపీ కవిత అన్నారు. అయిలాపూర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో ప్రతి గ్రామంలోని పేదలకు డబుల్‌ బెడ్‌రూం నిర్మిస్తామని, మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు ఇళ్లు లేవని దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఎవరికీ ఉండదన్నారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 5లక్షలు ఇస్తామన్నారు. మన రాష్ట్రం నుంచి 16 మందిని లోక్‌సభకు పంపిస్తే మనకు రావాల్సిన నిధులు బాజాప్త తెచ్చుకోవచ్చని, కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసేదేమీ లేదని, బీజేపీ అంటే భారతీయ జూట్‌ పార్టీ అని, దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని అన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top