స్ఫూర్తి పాదం !

Blade Running Competitions From 25th And 26Th August - Sakshi

25, 26వ తేదీల్లో పోటీలు.. ∙ పాల్గొననున్న యువత    

ఆత్మవిశ్వాసమే తోడుగా ఎయిర్‌టెల్‌ మారథాన్‌    

ఆర్టిఫిషియల్‌ కాళ్లతో అలుపెరగని పరుగుకు సిద్ధం

వైకల్యమే నివ్వెరబోయేలా సరికొత్త భాష్యం    

హిమాయత్‌నగర్‌  :కాళ్లు లేవని వారు కలత చెందలేదు. కృత్రిమ పాదాలను అమర్చుకుని సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. రెండు కాళ్లూ సక్రమంగా ఉన్న వారితో సమానంగా పరుగు పెడుతున్నారు. ఎయిర్‌టెల్‌ మారథాన్‌లో పాల్గొనిఅసాధారణ ప్రతిభ కనబరుస్తూ అందరికీ ఆదర్శంగానిలుస్తున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రన్నర్స్‌ విచ్చేసి పాల్గొంటారు. ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే ఈ రన్‌లో ఇప్పటికే పాల్గొనేందుకుచాలా మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ రన్‌లో పాల్గొనాలంటే రెండు కాళ్లు పనిచేయాలి.శక్తిసామర్థ్యాలతో దృఢంగా ఉండాలి. అలా ఉంటేనేఈ రన్‌ను సమర్థంగా చేస్తారు. ఇటువంటి రన్‌లో వైకల్యం కలిగిన వారు సైతం పాల్గొని ఇతరులకు ఆదర్శంగా నిలవడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఎయిర్‌టెల్‌ మారథాన్‌లో ఇప్పటికే పలుమార్లు పాల్గొని ప్రతిభకనబరిచిన నగరానికి చెందిన పలువురు యువత తమ మనోభావాలను ఇలా పంచుకున్నారు.అవి వారి మాటల్లోనే.. 

పోలీస్‌ శాఖ ప్రోద్బలంతో..
నా పేరు పిట్టల శివకుమార్‌. అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో రైటర్‌ను. ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకున్నా. ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ కాళ్లను అమర్చుకున్నా. పోలీస్‌శాఖ ఇచ్చిన ప్రోద్భలంతో ముందుకు సాగుతున్నా. ఎయిర్‌టెల్‌ మారథాన్‌లో ఇప్పటికే రెండు పర్యాయాలు పాల్గొన్నా. కొన్ని వేలమంది పాల్గొనే ఈ రన్‌లో నేనూ భాగస్వామిని కావడం ఆనందంగా ఉంది.  – పిట్టల శివకుమార్‌

ఇంట్లో కూర్చుంటేఏం వస్తుంది
నా పేరు మామిడిపల్లి పురుషోత్తం. మాది రామంతపూర్‌. స్కూల్‌ ఐడీ కార్డ్స్‌ ప్రింటింగ్, సప్‌లై వ్యాపారం చేస్తుంటాను.  పుండు కారణంగా ఎడమ కాలును కోల్పోయాను.  ఆర్టిఫిషియల్‌ కాలు అమర్చుకున్నా. నేను ఎయిర్‌టెల్‌ మారథాన్‌లో పాల్గొనడం ఐదోసారి. కాలు లేని కారణంగా ఇంట్లో మౌనంగా కూర్చుంటే ఏం సా«ధిస్తామనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో అడుగులు వేస్తూ మారథాన్‌లో పాల్గొంటున్నా.     – పురుషోత్తం

ఒలింపిక్స్‌లో పాల్గొనాలనుంది
నా పేరు సతీష్‌. విప్రోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేస్తున్నాను. 2013లో బోన్‌ కేన్సర్‌తో కుడి కాలు మోకాలు వరకు తీసేశారు. ఒకప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి రూమ్‌లో ఉండేవాడిని. వీకెండ్స్‌లో అందరూ నన్ను వదిలేసి వెళ్లిపోయేవారు. ఆ టైంలో ఒక పేపర్‌లో డీపీ సింగ్‌ గురించి చదివి, స్ఫూర్తి పొందాను. ఆయన స్ఫూర్తితోనే ఎయిర్‌టెల్‌ మారథాన్‌లో మూడు పర్యాయాలు పాల్గొనగలిగా. 2020లో జరిగే ఒలిపింక్స్‌లో పాల్గొనాలనుంది.       – సతీష్‌

మారథాన్‌లో ఐదుసార్లు పాల్గొన్నా..
నా పేరు మేడిపల్లి సంతోష్‌. టెక్‌మహేంద్రాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. 1998లో జరిగిన రైలు ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకున్నాను. జీవింతంలో అనుకున్న లక్ష్యాలన్నీ ఒక్కొక్కటిగా చేరుకుంటూ వస్తున్నా. ఎయిర్‌టెల్‌ మారథాన్‌తో పాటు, పోలీస్‌శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే మారథాన్‌లలో సైతం పాల్గొంటున్నాను. ఇప్పటికీ ఎయిర్‌టెల్‌ మారథాన్‌లో ఐదుసార్లు పాల్గొన్నా.    
    – మేడిపల్లి సంతోష్‌

అందరూ మెచ్చుకోవడం బాగుంది
నేను విశాల్‌ ఠాగూర్‌ను. ఎంసీఆర్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ను. ఐదేళ్ల క్రితం యాక్సిడెంట్‌లో ఎడమ కాలును కోల్పోయాను. ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ కాలు అమర్చారు. నేను రెండుసార్లు మారథాన్‌లో పాల్గొన్నాను. స్నేహితులమంతా రెండు కాళ్లు ఉన్నవారితో కలసి పరిగెత్తలేము. కానీ ఇది మాకో ఫిజికల్‌ ఛాలెంజ్‌గా తీసుకుంటున్నాం. ఒక కాలు లేకపోయినా వీడు భలే పరిగెత్తుతున్నాడని అందరూ పొగడ్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది.                         – విశాల్‌ ఠాగూర్‌

దేనిలోనూ తీసిపోను
నా పేరు రజిత. కామారెడ్డి కలెక్టరేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా. దిల్‌సుక్‌నగర్‌ బాంబు పేలుడులో కాలు పోయింది. ఆర్టిఫిషియల్‌ కాలు అమర్చారు. ఎయిర్‌టెల్‌ మారథాన్‌లో  పాల్గొనడం ఇది రెండోసారి. కొన్ని వేలమంది పాల్గొనే ఎయిర్‌టెల్‌ మారథాన్‌లో మొదటిసారిగా రెండేళ్ల క్రితం పాల్గొన్నాను. నాకు నేనుగా చాలా దృఢపడ్డాను. ఇతరుల కంటే నేనేం తక్కువ కాదనే విషయాన్ని ఆ రోజే గుర్తించగలిగా.  – రజిత

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top