రెవెన్యూలో బయోమెట్రిక్‌..

Biometric System Used In Revenue Department Office Warangal - Sakshi

ఖానాపురం: చిన్నగా ఆఫీస్‌కు వెళుదామనుకునే రెవెన్యూ ఉద్యోగులకు ఇక కుదరదు. కార్యాలయానికి వెళ్లి కనబడి ఇతర పనులు చూసుకుందామనుకుంటే ఇక ఆ ఆటలు చెల్లవు.. సమయం పాటించని ఉద్యోగులకు బయోమెట్రిక్‌తో పరుగులు పెట్టించడానికి అధికారులు సమయాత్తమవుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో సమయపాలన పాటించేవిధంగా ప్రభుత్వం బయోమెట్రిక్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.జిల్లా వ్యాప్తంగా 16 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో తహసీల్దార్, డీటీ, ఆర్‌ఐ, సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్‌లతో పాటు వీఆర్వో, వీఆర్‌ఏ, కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. ప్రతీ రోజు ఉదయం 10.30 గంటలకు విధులకు హాజరై, సాయంత్రం 5 గంటలకు విధులు ముగించాల్సి ఉంటుంది.

ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రతీ తహసీల్దార్‌ కార్యాలయంలో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయడానికి మొదట 2012 నుంచి 2014 సంవత్సరం వరకు బయోమెట్రిక్‌ విధానాన్ని చేపట్టారు. నాడు ఉద్యోగులు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సరిగ్గా చేయకపోవడంతో పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారు. ఆ తర్వాత బయోమెట్రిక్‌ విధానాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఇటీవల కాలంలో రెవెన్యూశాఖపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరోసారి తహసీల్దార్‌ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయడానికి కలెక్టర్‌ ముండ్రాతి హరిత, జేసీ రావుల మహేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో జరిగే దానికంటే ముందే కలెక్టరేట్‌ కార్యాలయంలో బయోమెట్రిక్‌ విధానాలు అమలు చేసి తహసీల్దార్‌ కార్యాలయాల్లో చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే లక్ష్యంగా కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రస్తుతం బయోమెట్రిక్‌ విధానాన్ని విజయవంతంగా సాగిస్తున్నారు.

ఐదు రోజులుగా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ 
ప్ర
తీ తహసీల్దార్‌ కార్యాలయంలో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేసేందుకు కలెక్టర్‌ హరిత కా ర్యాలయ సిబ్బందికి సూచించారు. ఈ నెల 2 నుం చే అమలు చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత వారం రోజులకు పైగా సిబ్బంది బయోమెట్రిక్‌ విధానాన్ని వినియోగించుకోవడానికి ఆధార్‌ను ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకోవ డం జరిగింది. ఆలస్యం చేయకుండా మంగళవా రం నుంచి తప్పకుండా ఉద్యోగులు బయోమెట్రిక్‌ను వినియోగించాలనే స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఉద్యోగులు ఆధార్‌ ఎన్‌రోల్‌ చేసుకుం టూనే విధుల హాజరును చేపడుతున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 191 మంది ఉద్యోగులు రి జిస్టర్‌ చేసుకోగా 180 మంది ఉద్యోగులకు బయోమెట్రిక్‌ ఆక్టివేట్‌ కావడం జరిగింది. అలాగే జిల్లాలో మంగళవారం రోజున 59 మంది బయోమెట్రిక్‌ను ఉపయోగించినట్లు సమాచారం.

తేలనున్న ఉద్యోగుల సంఖ్య 
బయోమెట్రిక్‌ విధానంతో జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల సంఖ్య స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రతీ తహసీల్దార్‌ కార్యాలయంలో ఉండాల్సిన ఉద్యోగల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉండటంతో ప్రజలకు న్యాయమైన సేవలు అందడంలేదు. కొన్ని ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఐదుగురు లోపు మాత్రమే ఉద్యోగులు ఉండడంతో ప్రజలకు కావాల్సిన సేవలు అందించడంతో రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థి«తులు ఏర్పడుతున్నాయి. బయోమెట్రిక్‌ విధానం ద్వారా పూర్తిస్థాయిలో ఉద్యోగుల సంఖ్య తెలిసే అవకాశం ఉండగా విధులకు ఎంత మంది హాజరవుతున్నారనే విషయం కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులు ప్రతీ రోజు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగుల సంఖ్య తేలిన తర్వాత కావాల్సిన ఉద్యోగుల వివరాలను ప్రభుత్వానికి పంపించడానికి కలెక్టరేట్‌ అధికారులు సమయాత్తమవుతున్నారు. 

వీఆర్వోలకు మినహాయింపు
బయోమెట్రిక్‌ విధానాన్ని తహసీల్దార్‌ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులకు మాత్రమే వినియోగించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వీఆర్వోలు, వీఆర్‌ఏలకు బయోమెట్రిక్‌ను అనుసంధానం చేస్తే ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో వారికి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు విధులపై నిర్లక్ష్యం చేయకుండా ఉండటానికి బయోమెట్రిక్‌ చాలా ఉపయోగపడనుంది. బయోమెట్రిక్‌ను అందుబాటులోకి తీసుకువస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అమలుకు శ్రీకారం చుట్టాం 
ప్రతీ తహసీల్దార్‌ కార్యాలయంలో బయోమెట్రిక్‌కు శ్రీకారం చుట్టాం. ఈ నెల 2 నుంచి అమలు చేయాలని కలెక్టర్‌ నుంచి ఆదేశాలు అందుకున్నాం. ఇప్పటికే కలెక్టరేట్‌లో అమలు చేయడం జరుగుతుంది. ప్రతీ తహసీల్దార్‌ కార్యాలయంలో బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రారంభిస్తున్నం. – రాజేంద్రనాథ్, కలెక్టరేట్‌ ఏఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top