హైదరాబాద్‌లో బయో ఆసియా

Bio Asia in Hyderabad - Sakshi

ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు సదస్సు 

లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాలకు ఊతం: మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దశాబ్దకాలంగా భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఉన్న పెట్టుబడులు, ఇతర అవకాశాల కోసం ప్రపంచ స్థాయిలో పేరొందిన లైఫ్‌ సైన్సెస్, ఫార్మా పారిశ్రామిక వర్గాలతోపాటు పరిశోధకులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలను ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో ‘బయో ఆసియా’కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి హైదరాబాద్‌ వేదికగా మూడ్రోజుల పాటు జరిగే 17వ బయో ఆసియా సదస్సుకు రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రపంచ స్థాయి లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు హైదరాబాద్‌కు రావడంలో బయో ఆసియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. హైదరాబాద్‌లోని ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులు, పెట్టుబడికి ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు బయో ఆసియా దోహదపడుతుందని వివరించారు. బయో ఆసియా సదస్సు తర్వాత హైదరాబాద్‌ లైఫ్‌ సైన్సెస్, ఫార్మా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. గతంలో జరిగిన బయో ఆసియా సదస్సుల్లో స్థానిక సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను పరిచయం చేశామని చెప్పారు. ఈ సదస్సుకు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌తో పాటు ప్రపంచ స్థాయి కంపెనీల సీనియర్‌ ప్రతినిధులు, పరిశోధకులు హాజరవుతారని తెలిపారు. 

టుడే ఫర్‌ టుమారో.. 
ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే బయో ఆసియా సదస్సును హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్నారు. ‘టుడే ఫర్‌ టుమారో’అనే నినాదంతో జరిగే ఈ సదస్సులో ప్రపంచంలోని లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు రేపటి తరాల కోసం తమ ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు, పెట్టుబడులకు అనువైన విధానాలు రూపొందించడంపై చర్చిస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి 37 దేశాలకు చెందిన సుమారు 2 వేల మంది ప్రతినిధులు, 800 కంపెనీల ప్రతినిధులు, 75 స్టార్టప్‌ కంపెనీలు ఈ సమావేశాల్లో భాగస్వాములవుతారు.

17వ బయో ఆసియా సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్‌తో పాటు అసోం, కేరళ, ఒడిశా, గుజరాత్‌ రాష్ట్రాలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య రంగంలో వస్తున్న అంటువ్యాధులను మరింత సమర్థంగా ఎదుర్కోవడంపై సదస్సులో చర్చించనున్నారు. నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆరోగ్య రంగంలోని సవాళ్లకు చవకైన పరిష్కారం కనుగొనడంపై దృష్టి సారిస్తుంది. లైఫ్‌ సైన్సెస్‌ టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ రంగాల్లో మహిళలు సాధించిన ప్రగతిపైనా చర్చించనున్నారు. ఇండియా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి అనేక దేశాల నుంచి ఎంపిక చేసిన 75 స్టార్టప్‌ కంపెనీలు 175 ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top