‘డబుల్‌’ రగడ

Bhadradri, Uproar In Double Bed Room Beneficiary Selection - Sakshi

అరుపులు, కేకలతో గ్రామసభ

పేర్ల తొలగింపుపై అధికారులను నిలదీసిన లబ్ధిదారులు

పోలీసుల వలయంలో లాటరీ ద్వారా ఎంపిక  

సాక్షి, ఖమ్మం అర్బన్‌: నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేసేందుకు రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. తొలుత రఘునాధపాలెం మండలంలో పూర్తయిన 216 ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు నగరంలోని 2, 3, 4, 5, 6 డివిజన్లలోని పేదలకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఆయా డివిజన్ల పరిధిలో దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో అర్హులైన వారిని గుర్తించి లాటరీ ద్వారా ఎంపికలకు శ్రీకారం చుట్టారు.

ఈ క్రమంలో 2వ డివిజన్‌లో లబ్ధిదారుల ఎంపిక కోసం పాండురంగాపురం పాఠశాలలో తహశీల్దార్‌ శ్రీలత అధ్యక్షతన శనివారం గ్రామసభ ఏర్పాటు చేశారు.  అందిన దరఖాస్తులు, అర్హుల, అనర్హుల జాబితాలను పాఠశాలలో గోడలకు అతికించారు. వాటిని పరిశీలించుకున్న వారిలో తొలిగించిన జాబితాలో ఉన్న వారు అరుపులు, కేకలు, అగ్రహాలతో రెవెన్యూ అధికారులను నిలదీశారు.  అద్దె ఇళ్లలో ఉంటూ, నిత్యం కూలీకి వెళ్తేనే పొట్టగడిచే తాము ఎందుకు అర్హులం కాదని ప్రశ్నించారు.

దీంతో ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు తొలిగింపులకు కారణం,  మళ్లీ నిజమైన అర్హత ఉంటే వారి పేర్లు చేర్చడం వంటి ఘటనలతో పాఠశాలలో గందరగోళ వాతావరణం నెలకొంది. డివిజన్‌లో 700 మందిపైగా దరreఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారులు వారిలో 385 మందిని అర్హులుగా గుర్తించారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి లాటరీ కార్యక్రమం కొనసాగించారు. తహశీల్దార్‌ శ్రీలత, డీటీ సురేష్‌బాబు, ఆర్‌ఐ రాజేష్, వీఆర్‌ఓ వెంకటేశ్వర్లు  ఈ ప్రక్రియను కొనసాగించారు. సీఐ నాగేంద్రాచారి, ఎస్‌ఐలు రామారావు, మోహన్‌రావు బందోబస్తు  ఏర్పాటు చేశారు.

రాత్రి 7 గంటల వరకు లాటరీ ప్రక్రియ..
రాత్రి 7 గంటలకు వరకు లాటరీ ద్వారా 40 మంది లబ్ధిదారులకు ఎంపిక చేశారు. వికలాంగులకు 2, ఎస్టీలకు 2, ఎస్సీలకు 7, మైనార్టీలకు 5, ఇతరులకు 24 రిజ్వరేషన్‌ ప్రకారం కేటాయించినట్లు తహశీల్దార్‌ తెలిపారు. మిగిలిన 385 మందిలో 40 పోగా మిగతా వాటిని కూడా ఇదే పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు.
పేర్ల తొలగింపుపై అధికారులను ప్రశ్నిస్తున్న లబ్ధిదారులు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top