బాబు మరో క్రెడిట్ చోరీ..
వైఎస్ జగన్ హయాంలో జరిగిన సంస్కరణలు తన ప్రతిభేనంటూ ప్రచారం.. నిజానికి నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యే విధానాన్ని తెచ్చింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే
ఇందుకోసం 2023లోనే సాఫ్ట్‌వేర్ ‘కార్డ్ 2.0’ అమల్లోకి
స్లాట్ బుకింగ్, ఆటోమ్యుటేషన్ కూడా అప్పుడే మొదలు
వీటన్నింటి ఫలితంగానే సులభంగారిజిస్ట్రేషన్ల ప్రక్రియ
అప్పట్లో దానిపై విష ప్రచారం చేసిన చంద్రబాబు, ఎల్లో మీడియా
సాక్షి, అమరావతి: దేశంలో ఏం సంస్కరణ జరిగినా, ఎక్కడ మంచి ఫలితం కనిపించినా అది తన ఘనతేనని సిగ్గూఎగ్గూ లేకుండా ప్రచారం చేసుకునే చంద్రబాబు తాజాగా మరో క్రెడిట్ చోరీకి బరితెగించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో చిన్న మార్పు కూడా చేపట్టకుండానే ఏడాదిన్నర గడిపేసిన ఆయన.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వేగంగా రిజిస్ట్రేషన్లు జరిగే ప్రక్రియ ప్రారంభమై విజయవంతంగా అమలవుతుంటే దీనినీ తన ఖాతాలో వేసుకుంటున్నారు.
రెండ్రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సదస్సులో దీని గురించి మాట్లాడుతూ.. పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అయిపోయిందని తనకు ఒక మెసేజ్ వచ్చిందని, అది తనకెంతో సంతోషాన్నిచ్చిందని.. ఆ ఘనత తనదేనని నమ్మబలికారు. నిజానికి.. నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు జరిగేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను మార్చడానికి ఆయన ఒక్క చర్య కూడా తీసుకోలేదు.
ఆయనేమీ చేయకుండానే ఇప్పుడు అత్యంత సులభంగా, వేగంగా రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోతున్నాయి. ఎందుకంటే.. అది వైఎస్ జగన్ హయాంలో ఎంతో ముందుచూపుతో అమల్లోకి తెచ్చిన విధానం. రిజిస్ట్రేషన్ల శాఖను ఆధునిక టెక్నాలజీతో అనుసంధానం చేయడానికి జగన్ సర్కార్ అప్పట్లో ఎంతో కసరత్తు చేసింది.
ఒరిజినల్ దస్తావేజులు ఇవ్వరంటూ విషం కక్కింది బాబే..
రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగిన సంస్కరణలపై అప్పట్లో చంద్రబాబు మోపిన అభాండాలు అన్నీఇన్నీ కావు. సులభంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి తెచ్చిన ఆన్‌లైన్ విధానంలో ప్రజలకు ఒరిజినల్ దస్తావేజులు ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారంటూ ప్రజలను బెంబేలెత్తించారు.
అందరి ఆస్తులను జగన్ లాగేసుకుంటారని, ఒరిజినల్ దస్తావేజులు ప్రభుత్వం వద్దే ఉంటాయని, వాటిని చూపి అప్పులు తెస్తారని, ప్రజల ఆస్తులు గంగలో కలిసినట్లేనని ఎల్లో మీడియా ద్వారా ప్రజల్లో అనేకానేక అపోహలు సృష్టించారు. అలాంటి దుష్ప్రచారాలతో ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఇప్పుడు అవన్నీ మరచిపోయి.. జగన్ తీసుకొచ్చిన విధానంవల్ల జరుగుతున్న మంచిని తనదని డబ్బా కొట్టుకోవడం ఆయన దిగజారుడు వైఖరికి నిదర్శనమని విమర్శకులు చెబుతున్నారు.
గ్రామ గ్రామాన ఈ వ్యవస్థను బాబు రద్దుచేశారు..
కార్డ్ 2.0 విధానాన్ని కేవలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే కాకుండా ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలోనూ అమలయ్యే వ్యవస్థను అప్పట్లో జగన్ తీసుకొచ్చారు. చంద్రబాబు వచ్చాక దాన్ని రద్దుచేశారు. అది అమల్లో ఉంటే ప్రజలు ఇంకా సులభంగా తమ గ్రామంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉండేది. అలాంటి అవకాశం జనానికి లేకుండా చేసిన ఘనత చంద్రబాబుది. ఈ రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియలో సంబంధిత ఆస్తిని సబ్ డివిజన్ చేయాల్సి వస్తే వెంటనే జరిగిపోయే పద్ధతిని కూడా జగన్ ప్రవేశపెట్టారు.
అలాగే, రిజిస్ట్రేషన్ జరిగిన సంబంధిత ఆస్తి వినియోగదారుడి పేరుపై మ్యుటేషన్ కూడా ఆటోమేటిక్‌గా జరిగే విధానాన్ని అప్పుడే తీసుకొచ్చారు. ఇందుకోసం కార్డ్ 2.0 సాఫ్ట్‌వేర్‌ను రెవెన్యూ శాఖ పరిధిలోని వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం చేశారు. అస్తవ్యస్థంగా, రోజుల తరబడి జరిగే రిజిస్ట్రేషన్ల విధానాన్ని సులభంగా మార్చే సంస్కరణ తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నీచాతి నీచంగా బురదజల్లి లబ్ధిపొందారు. కానీ, ఇప్పుడు అదే విధానం బాగుండేసరికి అది తన ప్రతిభేనని డప్పు కొట్టుకుంటున్నారు.
2023లోనే సులభతర రిజిస్ట్రేషన్ల విధానం..
» వాస్తవానికి.. 2023 ఆగస్టులో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ (కార్డ్)ను ఆధునీకరించి కార్డ్ 2.0 వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
» దీనిద్వారా స్టాంపు పేపర్లు, సంతకాలతో పనిలేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఏర్పడింది.
» డాక్యుమెంట్‌ను ఎవరికి వారే ఆన్‌లైన్‌లో తయారుచేసుకుని, ఆన్‌లైన్‌లోనే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును చలానా ద్వారా కట్టి, ఒక టైం స్లాట్‌ను బుక్‌చేసుకుని ఆ సమయానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే సరిపోయే వ్యవస్థ అది.
» సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేస్తే 5–10 నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అప్పటి నుంచి ఈ విధానం అమలవుతోంది.
» కానీ, చంద్రబాబు ఇప్పుడు తానే ఆ విధానాన్ని తీసుకొచ్చినట్లు బిల్డప్ ఇచ్చుకుంటూ కలెక్టర్ల సదస్సులో సిగ్గులేకుండా చెప్పుకున్నారు. ఇది చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు.


