వంతెన.. ఇంతేనా..? 

Bhadracham Across bridge Godavari In Bad Shape In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం : రెండు ప్రాంతాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన వారధి అది. దశాబ్దాల చరిత్ర ఉండటమే కాకుండా లెక్కలేనన్ని వాహనాలు ఆ వంతెనపై నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనాల రద్దీ పెరగడంతో మరో వంతెన నిర్మాణం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఒక కొలిక్కి రావడం లేదు. ఉన్న వంతెన కాస్తా శిథిలమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే వంతెనపై పెచ్చులూడుతూ, తారు లేచిపోయి, ఇనుప చువ్వలు బయటపడి ప్రమాదకరంగా మారింది. వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతారో అర్థంకాని పరిస్థితి ఉంది. అధికారులు దీనికి తాత్కాలిక మరమ్మతులు సైతం చేపట్టకపోవడంతో పరిస్థితులు రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. భద్రాచలం పుణ్యక్షేత్రానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. 

అంతేకాక ఈ వంతెనమీదుగానే ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. భారీ వాహనాల రాకపోకలతో వంతెన ఊగిసలాడుతోంది. ప్రస్తుతం గోదావరి నదిలో వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక ఇటీవలికాలంలో బ్రిడ్జి రెయిలింగ్‌ను వాహనం ఢీకొనగా, దెబ్బతిన్నది. ఆ రెయిలింగ్‌ స్థానంలో తాత్కాలికంగా కర్రలు పెట్టారు. గోదావరి నదిపై ఉన్న వంతెన నుంచి నదిని చూసేందుకు సందర్శకులు వస్తున్నారు. ఇప్పుడు ఆ రెయిలింగ్‌ ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు దీనిపై శ్రద్ధపెట్టి మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నదిపై వంతెన దుస్థితిపై ‘సాక్షి’ ఫొటో ఫీచర్‌. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top