కట్టి‘బెట్టు’డు కానరాదే..! | betting on ipl matches in district | Sakshi
Sakshi News home page

కట్టి‘బెట్టు’డు కానరాదే..!

May 26 2014 2:16 AM | Updated on Sep 2 2017 7:50 AM

ఐపీఎల్ బెట్టింగ్ దందా నెలరోజులుగా జిల్లాలో భారీగా సాగుతోంది. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి.

ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: ఐపీఎల్ బెట్టింగ్ దందా నెలరోజులుగా జిల్లాలో భారీగా సాగుతోంది. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఒక్కో మ్యాచ్‌పై రూ.వెయ్యి నుంచి రూ.ఐదు లక్షల వరకు బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా సరిహద్దు మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మరింత జోరుగా సాగుతున్నట్లు సమాచారం. కృష్ణ, పశ్చిమగోదావరి తదితర జిల్లాలకు చెందిన కొంతమంది ఖమ్మం జిల్లాను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యసనం విద్యార్థుల్లోనూ వ్యాపిస్తోంది. ఇటీవల ఖమ్మం నగ రానికి చెందిన ఓ కళాశాల విద్యార్థి తనకు వచ్చిన స్కాలర్‌షిప్ డబ్బులతో ఐపీఎల్ బెట్టింగ్ కాసి చేతులు కాల్చుకున్నాడు.

ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులు తమ తల్లితండ్రులు కొనిచ్చిన ల్యాప్‌టాప్‌లను, సెల్‌ఫోన్‌లను సైతం ఐపీఎల్ బెట్టింగ్ కోసం తాకట్టుపెడుతున్నట్లు తెలిసింది. ప్రముఖుల పిల్లలు కూడా తమ సరదా తీర్చుకోవడం కోసం విచ్చలవిడిగా ఈ తంతులో పాల్గొంటున్నారు. టెన్త్, ఇంటర్, డీగ్రీ కళాశాలలకు సెలవులు రావడం, మరికొన్ని ఇంజ నీరింగ్ కళాశాలలకు ప్రిపరేషన్ సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఈ మాయలో పడుతున్నారు. గతంలో కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బెట్టింగ్ ఈసారి మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించింది.

 కాకా హోటళ్లే అడ్డా...
 బెట్టింగ్ తంతు ఎక్కువగా చిన్న చితకా హోటళ్లు, బార్‌షాపుల లో జోరుగా సాగుతోందని తెలుస్తోంది. ఇలాంటి చోటైతే ఎవరికీ అనుమానం రాదని భావించిన కొందరు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. ఇవే కాకుండా నగరంలోని ప్రధాన లాడ్జీలు, రెస్టారెంట్లు వేలకు వేలు అద్దెలు వసూలు చేస్తూ బెట్టింగ్ రాయుళ్లకు ఆశ్రయం ఇస్తున్నట్లు తెలిసింది.

 పట్టించుకోని అధికారులు
 పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవారం రోజుల్లో ఐపీఎల్  ముగుస్తుడండంతో ఈ జోరు మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిస్థితి మరింత తీవ్రం కాకముందే  అడ్డుకట్ట వేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement