బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై బీజేపీ మండిపాటు

BC quota Opposition parties plan protests - Sakshi

ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలి

ఈ ఫ్రంట్లు.. టెంట్లు కేసీఆర్‌ కుటుంబం కోసమే: కె.లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడం పట్ల బీజేపీ మండిపడింది. గతంలో ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు బీసీలను కూడా మోసం చేసిందని పేర్కొంది. బుధవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్ల తగ్గింపును ఖండిస్తున్నామని, ప్రభుత్వం జారీ చేసిన పంచాయతీరాజ్‌ ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. బీసీ జనాభా గణన తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించినా.. బీసీలకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా టీఆర్‌ఎస్‌ చేస్తున్న మోసాన్ని గమనించాలన్నారు. బీసీ రిజర్వేషన్లు సక్రమంగా లేకపోవడం వల్ల వందల గ్రామపంచాయతీల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. 

రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు...
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేవలం ఓట్ల కోసం గొర్రెలు, బర్రెలు అంటూ బీసీలను రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని లక్ష్మణ్‌ దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లలో న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కేసీఆర్‌ తిరుగుతున్నారని, ఈ ఫ్రంట్లు.. టెంట్లు.. వారి కుటుంబం కోసమేనని విమర్శించారు. గతంలో ఇలాంటి ఫ్రంట్‌లన్నీ విఫలమయ్యాయని, కేసీఆర్‌ ప్రయత్నాలు కూడా అంతేనన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ మ«ధ్యనేనని తెలిపారు.

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం మోదీ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 22 లక్షల ఓట్ల గల్లంతుకు కారణమైన వారిపై చర్యలు చేపట్టే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. తాము గతంలో చెప్పినట్లు రజాకార్ల రాజ్యం వస్తుందని, అందుకు హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రి ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ, ఓట్ల గల్లంతుపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు చేపట్టాలంటూ ఈ నెల 27న లక్ష్మణ్‌ నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నట్లు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top