ఆకాశంలో ఆటో రిక్షాల ధరలు

Auto Prices Hikes in Hyderabad - Sakshi

దాదాపు కారు రేట్లకు చేరువ  

త్రీ సీటర్‌ ఆటోకురూ.3.6 లక్షలు  

ఆల్టో కారు ధర రూ.4 లక్షలే..

అక్రమ పర్మిట్లు, బ్లాక్‌ మార్కెట్‌ విక్రయాలే కారణం  

ఆందోళన వ్యక్తంచేస్తున్న ఆటో కార్మిక సంఘాలు

సాక్షి, సిటీబ్యూరో: ఆటో పర్మిట్లపై విధించిన ఆంక్షలు కొందరు అక్రమార్కులకు రూ.లక్షలు కురిపిస్తున్నాయి. బ్లాక్‌ మార్కెట్‌కు ఊతమిస్తున్నాయి. పాత పర్మిట్లపై విక్రయించే కొత్త ఆటోలను  రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆటో అమ్మకాలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. కొత్త పర్మిట్లకు  ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో చాలామంది డ్రైవర్లు పాత ఆటోల స్థానంలోనే కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. దీంతో అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌ను వ్యాపారులు, ఫైనాన్షియర్లు భారీఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. వాహన తయారీదారులు 3 సీట్ల ఆటో ధర  రూ.1.58 లక్షలుగా నిర్ణయించగా షోరూంల్లో ఇన్‌వాయిస్‌కు భిన్నంగా ఒక్కో ఆటోను రూ.2 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

మరోవైపు తుక్కుగా మారిన పాత ఆటో పర్మిట్ల ధరలకు సైతం రెక్కలొచ్చాయి. వేలకొద్ది పాత పర్మిట్లను గుప్పిట్లో పెట్టుకొన్న ఫైనాన్షియర్లు ఒక్కో పర్మిట్‌ను రూ.1.5 లక్షల నుంచి రూ.1.6 లక్షల వరకు విక్రయిస్తున్నారు. కొత్త ఆటో కొనుగోలు చేయాలంటే పర్మిట్‌ ధరతో కలిపి దాదాపు రూ.3.6 లక్షల వరకు చెల్లించాల్సివస్తుంది. కేవలం రూ.1.58 లక్షలకు లభించాల్సిన ఆటో ఏకంగా రూ.3.6 లక్షలకు చేరుకోవడం గమనార్హం. మార్కెట్‌లో ఇప్పుడు ఆల్టో కారు ధర రూ.4 లక్షలే ఉంది. మరికొద్ది రోజుల్లో ఆటోల ధరలు కార్ల ధరలను సైతం మించిపోయే అవకాశం ఉందని ఆటో కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  నగరంలో వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆటో పర్మిట్లపై  విధించిన ఆంక్షలు కేవలం కొద్దిమంది డీలర్లు, ఫైనాన్షియర్ల అక్రమార్జనకు అవకాశంగా మారడం గమనార్హం. 

కొరవడిన నియంత్రణ..
నగరంలో వాహన కాలుష్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భూరేలాల్‌ కమిటీ సిఫార్సుల మేరకు  2002లోనే ప్రభుత్వం కొత్త ఆటోలపై ఆంక్షలు విధించింది. అప్పటికి కేవలం 80 వేల ఆటోలే ఉన్నాయి. ఇవి బాగా పాతబడిపోతే, వినియోగించేందుకు అవకాశం లేకుండా ఉంటే వాటిని తుక్కుగా మార్చి పాత పర్మిట్ల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు మాత్రం వెసులుబాటు కల్పించారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటోల సంఖ్య 80 వేలు దాటేందుకు వీలులేదు. కానీ  ఆటోలపై నిషేధాన్ని ప్రభుత్వం తరచూ సడలించింది. దఫదఫాలుగా మరో 45 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇచ్చింది. దీంతో నగరంలో ఆటోల సంఖ్య 1.25 లక్షలకు చేరింది. ప్రస్తుతం కొత్త ఆటోలకు అనుమతులను నిలిపివేశారు.ఈ క్రమంలో ఆటో డ్రైవర్లు యథావిధిగా పాత పర్మిట్ల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేస్తున్నారు. నిజానికి కొత్తగా పర్మిట్లను విడుదల చేసినా, పాత పర్మిట్లపై కొత్తవి కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించినా వ్యాపారులు, ఫైనాన్షియర్ల అక్రమార్జనకే ఊతంగా మారాయి. 20వేల పర్మిట్లు విడుదల చేసిన రోజుల్లోనూ  బ్లాక్‌ మార్కెట్‌  వ్యాపారం జరిగింది. ఇప్పుడు  ఆంక్షలు ఉన్పప్పటికీ  అదే దందా కొనసాగడం గమనార్హం.

ప్రేక్షక పాత్ర...
ఆటో డ్రైవర్లు ఫైనాన్షియర్ల వద్ద అప్పు చేసి కొనుగోలు చేస్తారు. తిరిగి అప్పు చెల్లించలేకపోవడంతో ఫైనాన్షియర్లు వాటిని జప్తు చేసుకుంటారు. ఇలా సుమారు లక్ష పాత ఆటోల పర్మిట్లు ఫైనాన్షియర్ల గుప్పిట్లోనే ఉన్నాయి. బినామీ పేర్లపై ఉన్న ఈ పర్మిట్లనే తిరిగి ఆటో డ్రైవర్లకు కట్టబెడుతూ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో షోరూంల నిర్వాహకులే ఫైనాన్షియర్లు. దీంతో ఆటోడ్రైవర్లు వారివద్ద జీవిత కాలపు రుణగ్రస్తులుగా మారుతున్నారు. ఈ విష వలయాన్ని అంతమొందించడంలో రవాణా శాఖ, పోలీసు, ఆర్థిక శాఖ వంటి ప్రభుత్వ విభాగాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. దీంతో ఉపాధి కోసం నగరానికి వచ్చి ఆటోలు కొనుగోలు చేసే పేద డ్రైవర్లు సమిధలవుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top