అటెండర్ | attender is responsible for the robbery | Sakshi
Sakshi News home page

అటెండర్

Nov 19 2014 3:07 AM | Updated on Aug 21 2018 5:46 PM

జిల్లాలో సంచలనం సృష్టించిన భూపాలపల్లిలోని రెండు ఏపీజీవీ బ్యాంకుల దోపిడీ ఘటన ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది.

భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్ : జిల్లాలో సంచలనం సృష్టించిన భూపాలపల్లిలోని రెండు ఏపీజీవీ బ్యాంకుల దోపిడీ ఘటన ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. జిల్లా లో ఎప్పుడూ జరగని విధంగా భూపాలపల్లి, ఆజంనగర్ శాఖ బ్రాంచీల్లో  ఒకేసారి చోరీ జరగడం తో ఏదో పెద్ద ముఠానే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీన్ని సవాల్‌గా తీసుకున్నరూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా భూపాలపల్లిలోనే తిష్టవేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగాన్నంతా ఇక్కడికి రప్పించి విచారణ ముమ్మరం చేశారు.

అడిషనల్ ఎస్పీ జాన్‌వెస్లీ, ములుగు డీఎస్పీ మురళీధర్‌తోపాటు జిల్లాలోని వివిధ డివి జన్ల డీఎస్పీలు, సీఐలు.. అర్బన్, రూరల్ సీసీఎస్ పోలీసులు అక్కడే మకాం వేశారు. భూపాలపల్లి బ్రాంచిలో పని చేసే తాత్కాలిక ఉద్యోగి ఈ దోపిడీకి సూత్రధారిగా తేలి నట్లు సమాచారం. అతడికి ఒకరిద్దరు మాత్రమే సహకరిం చినట్లు తెలుస్తోంది. రెండు బ్యాంకుల్లో రూ.9,44,83,100 విలువైన బంగారం, నగదును దోచుకెళ్లగా.. దొంగల కోసం జిల్లా పోలీసు యంత్రాంగం సోమవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. రెండు బ్రాంచీల ఉద్యోగులందరినీ సోమవారం అదుపులోకి తీసుకుని ఠాణాలో విచారిస్తున్నారు.

భూపాలపల్లి బ్రాంచి తాత్కాలిక ఉద్యోగి అటెండర్ రమేష్ విధులకు హాజరు కాలేదు. అతని మొబైల్ స్విచాఫ్ ఉండడంతో పట్టణంలోని అతడి నివాసానికి పోలీసులు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో వారి బంధువులు, స్నేహితులను ఆరా తీయగా.. తిరుపతి వెళ్తున్నానని చెప్పినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.  బ్యాంకుల సిబ్బందికి చెందిన ఫోన్ కాల్ లిస్ట్‌ను పరిశీలించగా.. రమేష్ ఇతర బ్రాంచీలకు చెందిన ఉద్యోగులతో పలుమార్లు మాట్లాడినట్లు తేలింది. ఈ నెల 16న  కూడా అతడు సెల్‌ఫోన్‌ను వినియోగించినట్లు వెల్లడైంది. సోమవారం నుంచి సెల్‌ఫోన్ స్విచాఫ్ వస్తోంది.ఈ నేపథ్యంలో పోలీసులకు రమేష్‌పై అనుమానం బలపడింది. లాకర్ తయారు చేసిన గోద్రెజ్ సంస్థ ప్రతినిధులను పోలీసులు రప్పిం చి చూపించారు. అది అసలు తాళపు చెవులతోనే తెరిచినట్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు చోరీ పని రమేషేనని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

బ్యాంకుకు డబ్బు రవాణా చేసే వాహనంలో పరారీ..
ఏపీజీవీబీలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగుల్లో 28 ఏళ్ల లోపు వారిని వచ్చే నెల రెగ్యులరైజ్ చేయనున్నట్లు రమేష్‌కు తెలిసింది. అతడికి సుమారు 40 ఏళ్లు ఉండడంతో తనకు ఉద్యోగం రాదని భావించి నిరాశకు గురయ్యాడు. బ్యాంకుకు కన్నం వేయాలనే దురాశ పుట్టింది. రమేష్ 12 ఏళ్లుగా బ్యాంకులో పనిచేస్తుండడంతో మేనేజర్‌తోపాటు ఉద్యోగులందరు అతడిని నమ్మేవారు. బ్యాంకు తాళాలు అతని చేతిలోకి వచ్చేవి.

దీంతో శనివారం రాత్రి దోపిడీకి పాల్పడేందుకు నిర్ణయించుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం ఉద్యోగులు వెళ్లిపోయాక ముందస్తుగా బ్యాంకు షెట్టర్ అలారమ్‌ను తొలగించాడు. సీసీ కెమెరా పుటేజీల కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను వెంట తీసుకుపోయాడు. బ్యాంకులో ఉన్న ఆజంనగర్ బ్రాంచి తాళాలను తీసుకుని పై అంతస్తు నుంచి కిందికి వచ్చాడు. కింద ఉన్న బేకరీ షాపులో భూపాలపల్లి బ్రాంచి తాళాలు ఇచ్చి ‘నేను తిరుపతికి వెళ్తున్నా.. తాళాలు ఇక్కడ ఇస్తానని మా సార్లకు చెప్పిన. వారు వచ్చాక తాళాలు ఇవ్వండి’ అని చెప్పి వెళ్లాడు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి మొదట ఆజంనగర్ బ్రాంచికి చేరుకుని వెంట తెచ్చుకున్న తాళాలతో బ్యాంకులోకి వెళ్లి దోచుకున్నాడు.

అక్కడ ఉంచిన భూపాలపల్లి బ్రాంచి అదనపు తాళాలను తీసుకుని బ్యాంకుకు చేరుకున్నాడు. లాకర్లలోని డబ్బు, బంగారు నగలు తీసుకున్నాడు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తాను పని చేసే బ్యాంకు కు డబ్బు తీసుకువచ్చే సుమోను హన్మకొండ నుంచి రప్పించుకున్నట్లు తెలిసింది. అదే వాహనంలో కుటుంబంతో శ్రీశైలం వెళ్లి... అక్కడి నుంచి నిజామాబాద్, బాసర వెళ్లాడు. అక్కడ సుమో డ్రైవర్‌ని తిరిగి పంపాడు.

అనంతరం రమేష్ కుటుంబంతో చెన్నైకి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు సుమో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది. చోరీకి ముందు రమేష్‌తో ఫోన్‌లో మాట్లాడిన వారందరినీ పోలీసులు విచారిస్తున్నారు. ‘రమేషే చోరీకి పాల్పడినట్లు ఇప్పుడే చెప్పలేం. అతడి గురించి ఆరా తీయడంతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.’ అని ములుగు డీఎస్పీ మురళీధర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement