కేసీఆర్‌కు కార్మిక చట్టాల గురించి తెల్వదా?

Ashwathama Reddy Fires On KCR Govt Over TSRTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మె విషయంలో మొండి ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని దుయ్యబట్టారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం లీకేజీలు ఇచ్చి ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. కార్మికులెవరూ భయపడవద్దని.. అందరికీ తాము అండగా ఉంటామని తెలిపారు.ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డితో పాటు జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డి, సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు పద్మనాభన్ పాల్గొన్నారు.(చదవండి : ఆర్టీసీ సమ్మె; రేపు బంద్‌.. ఉత్కంఠ)

సమ్మెకు సహకరించండి..
ఆర్టీసీ జేఏసీని విచ్చిన్నం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని రాజిరెడ్డి విమర్శించారు.  ‘నిరుద్యోగులెవరూ తాత్కాలిక  డ్రైవర్, కండక్టర్లుగా వెళ్ళకండి. ప్రజా రవాణా వ్యవస్థను విచ్ఛన్నం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దయచేసి నిరుద్యోగులు కార్మికులుగా వెళ్ళకండి. సమ్మెకు సహకరించండి’ అని రాజిరెడ్డి విఙ్ఞప్తి చేశారు. ఇక పద్మనాభన్‌ మాట్లాడుతూ.. కార్మికులంతా కలిసి ఆర్టీసీ కార్మికుల కోసం ఉద్యమం చేయడం మంచి పరిణామం అన్నారు. కేంద్ర కార్మిక మంత్రిగా ఉండి కార్మిక చట్టాల గురించి కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ‘సెల్ఫ్ డిస్మిస్ అనే పదం రాజ్యాంగంలో లేదు. ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆర్ ఆర్టీసీ ఉద్యమాన్ని అణచివేస్తాను అంటే ఎట్లా..100 ఏండ్ల నుంచి ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. మనం నిజాం పాలనలో లేము. రాజ్యాంగ పరమైన దేశంలో ఉన్నాము. సమ్మె చేయడం కార్మికుల హక్కు. బ్రిటిష్ రాజు లాగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యమానికి  రాజకీయ పార్టీలు కలిసి రావడం మంచి పరిణామం. దేశ వ్యాప్తంగా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు’అని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top