ఆర్టీసీ సమ్మె; రేపు బంద్‌.. ఉత్కంఠ

TSRTC Strike Enters 14th Day on Friday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజు కొనసాగుతోంది. చర్చలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో కార్మికుల ఆందోళనలు, నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రజా, ఉద్యోగ సంఘాలు, విపక్ష పార్టీలు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులకు న్యాయవాదులు, తెలంగాణ మెడికల్ ఉద్యోగుల జేఏసీ కూడా సంఘీ‌భావం ప్రకటించింది. ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో కరీంనగర్ రెండు డిపోల ముందు కార్మికులు శుక్రవారం ధర్నా, నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు.

జేఏసీ నాయకుల అరెస్ట్‌
సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బస్ భవన్ వరకూ ర్యాలీ చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులను వియస్‌టీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్థామరెడ్డి, ఇతర నేతలను అరెస్టు చేసి బలవంతంగా తీసుకెళ్లారు. రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌ నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేయడం​ గమనార్హం. మరోవైపు క్యాబ్‌ డ్రైవర్లు కూడా రేపటి నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు.

హైకోర్టు తీర్పుపై ఉఠ్కంఠ
ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గత విచారణలో ఉన్నత న్యాయస్థానం పలు కీలక వాఖ్యలు చేసింది. ఇరుపక్షాలు పంతానికి పోకుండా చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని, ఆర్టీసీకి ఎండీని నియమించి.. చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించింది. ఆర్టీసీ సమ్మె, ప్రజల సమస్యలపై పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వానికి ఆదేశించింది. శనివారం రాష్ట్రవ్యాప్త బంద్ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

బంద్‌కు సహకరించండి: తమ్మినేని
నల్లగొండ: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు సహకరించాలని ప్రజలకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వామపక్షాల నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నామని తెలిపారు. వ్యాపార, వాణిజ్య, సామాన్య వర్గాలు సహకరించాలని కోరారు. బంద్‌కు వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయని.. సన్నాహకాల్లో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్నామని చెప్పారు.

బీజేపీ బైక్‌ ర్యాలీ
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హైదరాబాద్ శేరిలింగంపల్లి నుంచి కూకట్‌పల్లి వరకు బీజేపీ బైక్‌ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్  స్వయంగా బైక్‌ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బైక్‌ ర్యాలీకి హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top