మరో 5 లక్షల ఐటీ జాబ్స్‌

Another 5 lakh IT jobs - Sakshi

నగరంలో వచ్చే నాలుగేళ్లలో రెట్టింపు కానున్న కొలువులు

హైసియా సంస్థ తాజా అంచనా

నిపుణుల లభ్యత, భౌగోళిక అనుకూలతల వల్లే...

ప్రస్తుతం రూ. లక్ష కోట్లు దాటిన ఐటీ ఎగుమతులు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగానికి చిరునామాగా నిలిచిన గ్రేటర్‌ హైదరాబాద్‌... ఈ రంగంలో మరింతగా పురోగమిస్తోంది. రాబోయే నాలు గేళ్లలో ఐటీ కొలువులు మరో ఐదు లక్షల వరకు పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) తాజాగా అంచనా వేస్తోంది. ప్రస్తుతం నగరం కేంద్రంగా సుమారు 600కుపైగా కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తుండగా ఈ సంస్థల్లో సుమారు 5.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు రూ. లక్ష కోట్లు దాటాయి.

శరవేగంగా వృద్ధి...: ఐటీ రంగానికి నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా, హైటెక్‌ సిటీ తదితర ప్రాంతాలు కొంగు బంగారంగా నిలుస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో రాబోయే నాలుగేళ్లలో నూతనంగా సుమారు 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఐటీ కార్యాలయాలు వెలిసే అవకాశాలున్నట్లు హైసియా ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, నూతన ప్రాజెక్టులకు అనుగుణంగా అవసరమైన నిపుణుల లభ్యత కూడా నగరంలో అందుబాటులో ఉండటంతో పలు బహుళజాతి ఐటీ కంపెనీలు నగరానికి వెల్లువలా తరలివస్తున్నాయని చెబుతున్నారు. భౌగోళిక అనుకూలతలు కూడా నగరంలో ఐటీ రంగం వృద్ధి చెందేందుకు కారణమని విశ్లేషిస్తున్నారు.

కొలువుల జాతర...
ఐటీ రంగంలో ప్రధానంగా డిమాండ్‌ అనూహ్యంగా పెరిగిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), డేటా సైన్స్, ఏఆర్, వీఆర్, బ్లాక్‌చైన్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ల అభివృద్ధి, విస్తరణ ప్రాజెక్టులు చేపట్టే సంస్థలు నగరంలో తమ కార్యకలాపాలు సాగించేందుకు ముందుకొస్తున్నాయని హైసియా అధ్యక్షుడు భరణి ‘సాక్షి’కి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ, హార్డ్‌వేర్‌ పాలసీలు కూడా ఈ రంగం విస్తరణకు దోహదపడుతున్నాయన్నారు. ఐటీ రంగంలో నూతనంగా కొలువులు సాధించే పట్టభద్రులు ప్రారంభంలో రూ. 3–3.5 లక్షలు, కొంత అనుభవం గడిస్తే రూ. 6–8 లక్షల వరకు వార్షిక వేతనం పొందుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగేళ్లలో ఐటీ కొలువులు మరో 5 లక్షల వరకు పెరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఏటా నగరం నుంచి చేపట్టే ఐటీ ఎగుమతుల్లో 17 శాతం మేర వృద్ధి నమోదవుతోందని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top