అంగన్‌‘వేడీ’ల విలవిల | Anganwadi centers | Sakshi
Sakshi News home page

అంగన్‌‘వేడీ’ల విలవిల

May 2 2017 3:10 AM | Updated on Jun 2 2018 8:36 PM

అంగన్‌‘వేడీ’ల విలవిల - Sakshi

అంగన్‌‘వేడీ’ల విలవిల

అంగన్‌వాడీ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఎండల తీవ్రతకు ఎవరూ రాకపోవడంతో బోసిపోతున్నాయి. ఫలితంగా కొన్ని రోజులుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం భారీగా పడిపోయింది.

నాగిరెడ్డిపేట/లింగంపేట (ఎల్లారెడ్డి):అంగన్‌వాడీ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఎండల తీవ్రతకు ఎవరూ రాకపోవడంతో బోసిపోతున్నాయి. ఫలితంగా కొన్ని రోజులుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం భారీగా పడిపోయింది. కొన్ని కేంద్రాల్లో సగానికి తక్కువగా, మరికొన్ని కేంద్రాల్లోనైతే ఒకరిద్దరు చిన్నారుల మాత్రమే హాజరవుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకొర వసతులు కలిగిన భవనాలతో పాటు ఇరుకైన అద్దె గదుల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన ఎండల కారణంగా చిన్నారులను కేంద్రాలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇక మండుటెండల్లో గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతూ కేంద్రాలకు వస్తున్నారు. కానీ వడగాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సగం మంది రావట్లేదు..
జిల్లాలోని 1,038 అంగన్‌వాడీ కేంద్రాలు, 155 మినీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో 55,137 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే, ప్రస్తుతం సగటున రోజుకు 25 వేల మంది చిన్నారులు కూడా కేంద్రాలకు హాజరు కాకపోవడం గమనార్హం. హాజరు శాతం పడిపోవడానికి దంచికొడుతున్న ఎండలే ప్రధాన కారణం. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో చిన్నారులు కేంద్రాలకు రావడం లేదు. వారిని పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి కేంద్రాల్లో చదివే పిల్లల వయస్సు 3 నుంచి 5 సంవత్సరాల లోపే. వీరు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలను తట్టుకొని కేంద్రాలకు రాగలరా.. వచ్చినా కేంద్రాల్లో ఉక్కపోతకు ఉండగలరా? అనే భావనతో తల్లిదండ్రులు చిన్నారులను పంపించడం లేదు.

వేసవి సెలవులు లేవు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేసవిలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాలు నడుపుతున్నట్లు జిల్లా ఐసీడీఎస్‌ పీడీ రాధమ్మ తెలిపారు. కానీ, ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు.

మరోవైపు, అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం చిన్నారులకు సెలవులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంగన్‌వాడీ టీచర్లకు నేటి నుంచి ఈ నెల 17 వరకు, ఆయాలకు 18 నుంచి 31 వరకు సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన సర్కారు.. అంగన్‌వాడీలకు మాత్రం వేసవి సెలవులు ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement