త్వరలో 15 వేల అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ | 15000 Anganwadi jobs to be filled soon | Sakshi
Sakshi News home page

త్వరలో 15 వేల అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ

Apr 10 2026 4:25 AM | Updated on Apr 10 2026 4:25 AM

15000 Anganwadi jobs to be filled soon

మంత్రి సీతక్క 

మహబూబాబాద్‌: రాష్ట్రంలో త్వరలో 15 వేల అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, దీంతో ఖాళీలు భర్తీ అవుతాయని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రణామ్‌ వయోవృద్ధుల డే కేర్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. తర్వాత పోషణ్‌ పక్వాడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గురువారం నుంచి ఈ నెల 23 వరకు నిర్వహించే పోషణ్‌ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

అంగన్‌వాడీల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ బకాయిలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తల వేతనాల పెంపు విషయంపై దృష్టి పెట్టామన్నారు. కారుణ్య నియామకాల విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. పోలీస్‌ శాఖ మాదిరిగానే అంగన్‌వాడీలకు కూడా ఒకే రకమైన డిజైన్‌ యూనిఫామ్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

రాష్ట్రంలో 37 వేలసెల్‌ ఫోన్లు అంగన్‌వాడీలకు కేటాయించగా, మహబూబాబాద్‌ జిల్లాలో 1,368 మంది అంగన్‌వాడీలకు ఇచ్చామన్నారు. అంగన్‌వాడీల సమస్యల విషయంలో జిల్లా నుంచి 5 నుంచి పది మంది ప్రతినిధులు వస్తే సమయం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, కోరం కనుకయ్య, కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement