మీ పేర్లేంటి.. అంతు చూస్తా.. | Altercation Between Endowment Department Officials And Sarpanch | Sakshi
Sakshi News home page

మీ పేర్లేంటి.. అంతు చూస్తా..

Jun 6 2020 1:56 PM | Updated on Jun 6 2020 1:57 PM

Altercation Between Endowment Department Officials And Sarpanch - Sakshi

దేవాదాయశాఖ అధికారులు, సర్పంచ్‌ మధ్య వాగ్వాదం

సాక్షి, వరంగల్‌ రూరల్: జనగామ జిల్లా రఘునాథపల్లిలో అంగడి స్థల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సర్పంచ్, దేవాదాయశాఖ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. దీంతో సర్పంచ్‌ పోకల శివకుమార్‌పై దేవాదాయశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో విద్యుత్‌ శాఖ ఏఈ ఇచ్చిన ఫిర్యాదుతో సర్పంచ్‌పై కేసు నమోదవగా, తాజాగా మరో ఫిర్యాదు అందింది. దేవాదాయ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కందుల అశోక్‌కుమార్‌ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని బస్టాండ్‌ వెనక ఉన్న దేవాదాయ శాఖ భూమిలో(2.11 ఎకరాలు) 2008 నుంచి అంగడి జరుగుతోంది. ప్రతి ఏటా టెండర్‌ ద్వారా నిర్వహణ బాధ్యతను అప్పగిస్తున్నారు. మార్చిలోనే టెండర్‌ ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నా.. లాక్‌డౌన్‌తో జాప్యం జరిగింది.

ఈ నెల 1న టెండర్‌ నిర్వహించగా స్పందన రాకపోవడంతో శుక్రవారం మరోసారి బిడ్లు స్వీకరించాలని నిర్ణయించారు. కమ్యూనిటీ హాల్‌లో సర్పంచ్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో ఎంపీఈఓ వేణుగోపాల్, జెడ్పీటీసీ మణికంఠ, ఎంపీటీసీ రవి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, ఉప సర్పంచ్‌ వాసుల సమక్షంలో టెండర్‌ ప్రక్రియను ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్‌కు చేరుకున్న దేవాదాయశాఖ ఈఓ శేషుభారతి, ఇతర అధికారులు 12 ఏళ్లుగా అంగడి నిర్వహిస్తూ దేవాదాయ శాఖకు పైసా ఇవ్వడం లేదని లీజు ప్రకారం రూ.21 లక్షల బకాయి చెల్లించాలని కోరారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ అనుమతి తీసుకున్న తర్వాతే టెండర్‌ నిర్వహించాలన్నారు.


ఎస్సైకి ఫిర్యాదు చేస్తున్న ఈఓ శేషుభారతి 

దీంతో తీవ్రంగా స్పందించిన సర్పంచ్‌ సమావేశం జరుగుతుంటే కార్యాలయానికి వస్తారా..? ఇక్కడకు రావడానికి మీరెవరూ .. ఎందుకు వచ్చారు.. మీ అంతు చూస్తా ..? అని విరుచుకు పడ్డారు. ఈ క్రమంలో దేవాదాయశాఖ అధికారులు, సర్పంచ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న ఎస్సై, ఇతర ప్రజాప్రతినిధులు ఇరువురికి నచ్చచెప్పారు. అనంతరం దేవాదాయశాఖ ఈఓ శేషుభారతి సర్పంచ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళా అధికారినని చూడకుండా బెదిరింపులకు దిగాడని, కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. 

12 ఏళ్ల క్రితం..
12 ఏళ్ల క్రితం అంగడి నిర్వహణ కోసం దేవాదాయశాఖకు చెందిన భూమిని జీపీ లీజుకు తీసుకుని ఏటా రూ.25 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి సర్పంచ్‌లు ఆ ప్రకారం చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. రూ.21 లక్షల బకాయి ఉందని, అవి చెల్లించాకే టెండర్‌ నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులు పలుమార్లు పంచాయతీకి నోటీసులు పంపారు. దీంతో రూ.3.20 లక్షలు చెల్లిస్తానని సర్పంచ్‌ చెబుతూ వస్తున్నారు. కాగా, రూ.3.20 లక్షలు తీసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు అంగీకరించలేదు. మొత్తం బకాయి చెల్లించాలని, లేని పక్షంలో దేవాదాయశాఖ కమిషనర్‌ అనుమతి తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement