సేద్యం.. శూన్యం 

Agriculture Is Not Good In Warangal - Sakshi

ఖరీఫ్‌ సీజన్‌లో సగటు వర్షపాతం నమోదైనా..రబీ పంటలకు సాగునీరు అందని దైనస్థితి అన్నదాతలకు ఎదురైంది. కోటి ఆశలతో అప్పులు చేసి పంటలను సాగు చేస్తే మండుతున్న ఎండలతో పంటలు ఎండిపోతుండటంతో ఏమీ చేయని దుస్థితి నెలకొంది. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన రూరల్‌ జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరు అందకపోవడంతో బీటలు బారుతున్నాయి. ఈ ఏడు రబీ సీజన్‌లో సాధారణ సాగు 40,686 హెక్టర్ల విస్తీర్ణం కాగా అన్ని పంటలు కలిపి 37,395 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైంది.  సాధారణ సాగులో 92శాతమే సాగైనప్పటికీ వర్షాభావ పరిస్థితులతో సాగునీరు అందక 20శాతం పంటలు కూడా చేతికందే పరిస్థితి లేదు.

నర్సంపేట: ప్రధానంగా వరి పంట, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులకు భారీ స్థాయిలో నష్టం కలుగుతోంది. జిల్లాలో 16,715 హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంట సాగు కాగా మొక్కజొన్న 14,853 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైంది. నీరు లేక పంట చేతికందే సమయంలో పంటలు ఎండిపోతుండడంతో పశువులకు మేతగా ఉపయోగపడుతుండడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు.

ఎండల గండం
ఎండలు మండుతుండడంతో జలాశయాల్లోని నీరు అడుగంటిపోతుంది. రోజురోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా చెరువులతో పాటు జిల్లాలోని ప్రధాన నీటి వనరులైన పాఖాల, మాధన్నపేట, రంగయ్యచెరువు, కోపాకుల చెరువు, చలివాగుల్లో నీరు తగ్గిపోయి బోషిపోతున్నాయి.40 డిగ్రీలు దాటుతున్న ఎండలతో  చేతికందాల్సిన పంటలు ఎండిపోతున్నాయి. బోరు బావు కూడా వట్టిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

10.19 మీటర్ల లోతుకు నీరు..
భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో భూగర్భజలాలు భారీగా తగ్గిపోయాయి. ఖరీఫ్‌ సీజన్‌లో సగటు వర్షపాతం జిల్లాలో నమోదు కావడంతో నీటి వనరుల్లో నీరు ఆశించిన స్థాయిలో నిల్వలేక భూగర్భజలాలపై ప్రభావం పడింది. ఫిబ్రవరి మాసంలో భూగర్భజలాలు 9.41 మీటర్ల లోతుకు పడిపోగా ఏప్రిల్‌లో మండుతున్న ఎండలతో అమాంతం 10.19 మీటర్ల లోతుకు  భూగర్భజలాలు పడిపోవడం ప్రమాద ఘటికలకు సూచికగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top