మళ్లీ.. ‘విందాం, నేర్చుకుందాం’ | Sakshi
Sakshi News home page

మళ్లీ.. ‘విందాం, నేర్చుకుందాం’

Published Mon, Jan 19 2015 4:23 AM

మళ్లీ.. ‘విందాం, నేర్చుకుందాం’ - Sakshi

* పునఃప్రారంభమైన ‘మీనా ప్రపంచం’
* నెలరోజులు ఆలస్యంగా అందిన షెడ్యూల్
* పాఠాలను నష్టపోయిన విద్యార్థులు
* ఇప్పటికీ మూలనే ఉన్న ‘రేడియో’లు

నాగిరెడ్డిపేట : ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ రేడియోలు పాఠాలు చెబుతున్నాయి. ఇటీవలే మళ్లీ మీనా ప్రపంచం ప్రారంభమయ్యింది. కాగా సమాచార లోపం కారణంగా విద్యార్థులు నెలరోజులు పాఠాలు నష్టపోవాల్సి వచ్చింది. అభ్యాసం అనేది మొదట వినడంతోనే ప్రారంభమవుతుంది. దృశ్యం కంటే శబ్ధానికే త్వరగా స్పందించడం సర్వసాధారణమైన విషయం.

దీనిని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం ‘మీనా ప్రపంచం’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో రేడియో పాఠాలను ప్రవేశపెట్టింది. ప్రాథమిక దశలో శ్రవణ మాద్యమం ద్వారా పాఠాలను బోధించి, చిన్నారులను చదువుకు చేరువ చేయాలనేది లక్ష్యం. అయితే రాష్ట్రవిభజన నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో రేడియోలు మూగబోయాయి. ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం రేడియో పాఠాలను అందించేందుకు నిర్ణయం తీసుకుంది.

‘మన ప్రపంచం.. మీనా ప్రపంచం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు రేడియో ద్వారా పాఠాలను బోధించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు రేడియోలో రోజువారీగా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలతో కూడిన షెడ్యూల్‌ను రూపొందించారు. ఆ షెడ్యూల్‌ను అనుసరిస్తూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆయా తరగతుల విద్యార్థులకు రేడియో పాఠాలను వినిపించాల్సి ఉంటుంది.
 
సమాచార లోపంతో..
అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని కిందిస్థాయికి చేరవేయడంతో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారు. డిసెంబర్ ఒకటో తేదీనుంచి ప్రారంభమైన కార్యక్రమానికి సంబంధించిన వివరాలు నాగిరెడ్డిపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డిసెంబర్ 31న అందాయి. రేడియో పాఠాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లు, కరదీపిక పుస్తకాలు, రోజువారీ కార్యక్రమ షెడ్యూల్ నెల ఆలస్యంగా అందాయి. దీంతో విద్యార్థులు నెల రోజుల పాఠాలను నష్టపోవాల్సి వచ్చింది.
 
పర్యవేక్షణ కరువు

పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘మన ప్రపంచం.. మీనా ప్రపంచం’ కార్యక్రమం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. పాఠశాలల తనిఖీకి వెళ్లే అధికారులు ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పట్టికలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రిజిష్టర్లు పరిశీలిస్తున్నారే తప్ప రేడియో పాఠాలకు సంబంధించిన రిజిష్టర్ గురించి ఆరా తీసిన దాఖలాలు లేవు.

దీంతో ఉపాధ్యాయులు సైతం ఈ కార్యక్రమం అమలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాగా చాలా పాఠశాలల్లో మూలనపడిన రేడియోల దుమ్మును ఇప్పటికీ దులపలేదని తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి రేడియో పాఠాల నిర్వహణపై పర్యవేక్షణ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement
Advertisement